Wednesday, 11 August 2021

శ్రీ హనుమద్భాగవతము (6)



దేవాధిదేవుడవగు మహాదేవా! నీవు యోగులకు ఉపాసింపదగిన వాడవు, మన్మధుని దగ్ధము చేసినవాడవు. అట్టి  నీవు స్త్రీ అవతారమును చూడనేల? నీ దృష్టిలో అది విశిష్టమైనది కాదని విష్ణువు నవ్వుతూ బదులు చెప్పెను.


‘దేవా! ఆ అవతారస్వరూపాన్ని దర్శింపకుండ ఉండలేను, దయ యుంచి నా కా మోహీనీరూపాన్ని చూపించామని పార్వతీపతి పలికెను. 


'అట్లే యగుగాక!' యని మహావిష్ణువు క్లుప్తంగా సమాధానమిచ్చి అంతర్థానమయ్యెను. ఆ సమయమున అల్లడ క్షీరసముద్రం లేదు, నీలమేఘశరీరము, శంఖచక్రగదాపద్మధారియైన లక్ష్మీపతి గూడ లేడు. ఆ ప్రదేశమున మనోహరమైన పర్వతములు, సుందరమైన వనము ఉండింది. పార్వతీ సహితుడై శంకరుడు ఆ వన మధ్యమున నుండెను. 


ఆడవి అంతట వసంతశోభ వ్యాపించియుంది. వృక్షములు కొత్త చిగుళ్ళతో చూడ ముచ్చటగొలుపుతున్నాయి. అంతట పుష్పములు విరబూసి ఉన్నాయి. సువాసనలను వెదజల్లు ఆ పూవుల పై తుమ్మెదలు మూగుతున్నాయి. కోకిలలు 'కుహూ కుహూ' అని శబ్దం చేస్తున్నయి. చల్లని పిల్ల గాలికి కోమలములగు లతలు, పుష్పములు మెల్ల మెల్లగ అటు ఇటు ఊగుతున్నాయి. అంతటా ఋతు రాజుయొక్క సామ్రాజ్యము వ్యాప్తమైనట్లు ఉంది, ఒకవిధమైన మాదకత్వము సర్వ ప్ర్రాణులలోను కనబడసాగినది.


యోగులకు ఉపాస్యుడగు త్రినేత్రుడు కొలదిదూరములో లతలమాటున నుండి బంతియాడుచున్న ఒక రూపవతి యైన స్త్రీని చూసాడు.


కామారి ధైర్యవిహీనుడు కాజొచ్చాడు, తన్నుతాను మఱచాడు. నిర్ని మేషదృష్టితో బంతియాడుచున్న ఆమోహినిని వీక్షిస్తూ ఉండిపోయాడు.


వెంటనే ఒక వాయుతరంగము వచ్చినది, ఆ గాలికి అసామాన్య సౌందర్యశాలిని యైన మోహినివస్త్రము జారినది, ఆమె వివస్త్ర అయింది. సిగ్గుచే కుంచించుకొని మోహిని లతల మాటున దాక్కొనుటకు ప్రయత్నిస్తోంది. భస్మము పూసుకోనే కామారి యొక్క మిగిలిన ధైర్యముగూడ తొలగినది. ఆయన మహామహిమామయి యైన పార్వతీ దేవి యెదుటనే లజ్జను విడచి యున్మత్తునివలె మోహిని వెంట పరిగెత్తాడు.

No comments:

Post a Comment