Thursday, 12 August 2021

శ్రీ హనుమద్భాగవతము (7)



యోగీశ్వరుడైన శంకరుడు తన వెంట రావడం చూచి మోహిని చిఱునవ్వు నవ్వి తీగలమాటున తన శరీరాన్ని దాచుకొనటానికి పరిగెత్తింది. భూతభావనుడు మోహిని వెంట పరుగెత్తుచున్నాడు. ఆమె ముందు పరుగెత్తుతున్నది. నీలకంఠుడు తనస్థితినే మఱచాడు. ఆయన పరుగెత్తి మోహిని చేతిని స్పృశించాడు.


ప్రజ్వలిస్తున్న అగ్నియందు అజ్యాహుతి (ఆవునెయ్యి) పడింది, కాని మోహిని తన చేతిని విడిపించుకొని పారిపోయింది. ఆమె స్పర్శచే ఉత్తేజితుడైన కామారియైన ఈశ్వరుడు పూర్తిగా స్పృహలేనివాడయ్యాడు. వనములు, పర్వతములు, ఋష్యాశ్రమములు; దేవలోకములు మొదలైన ప్రదేశములగుండా శంకరుడు మోహిని వెంట పరుగెత్తసాగాడు. పార్వతీ దేవి, శివగణములు, సురగణములు, ఋషులు మున్నగు వారందఱు ఆశ్చర్యచకితులై ఈ దృశ్యమును చూస్తూ ఉన్నారు, కాని మౌనముగా ఉండిపోయారు. అసఫలమైన కామము క్రోధంగా రూపాంతరం చెందుతుంది. మఱల ప్రళయంకరుడైన శంకరుని కోపానికి ఆహుతి ఎవరు కానున్నారోకదా! అందఱు స్తబ్ధులై ఉండిపోయారు.


చివరకు యోగిరాజైన శివుని రేతస్సు స్థలితమయింది. పిమ్మట తన స్థితి ఎట్టిదో గ్రహించాడు. విశ్వనాథుడు వెంటనే రెండు చేతులను జోడించి, తలవంచి 'ప్రభూ! నీ లీల అగమ్యము. నీ మాయను అధిగమించుట అసంభవం' అని పలికాడు.


తన పరమ ప్రభువు యొక్క లీల అగమ్యము అనిర్వచనీయమని తెలిసికొని శంకరభగవానుడు ఆయనను స్తుతించసాగాడు. ఇంతలో వనమాలాధారి, చతుర్భుజుడైన విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఉమావల్లభుడైన శివుని నిష్ఠను విశ్వాసాన్ని ప్రశంసించి అంతర్థానమయ్యాడు. పరమపిత, కర్పూరగౌరుడైన శంకరుడు కూడా పార్వతీ దేవితో భగవానునిగుణములను గానము చేస్తూ కైలాసానికి వెల్లాడు.


శంకరుని అమోఘవీర్యము వ్యర్థం ఎట్లా అవుతుంది? ఆ వీర్యమును రామకార్యసిద్ధికై ప్రయోగించాలనే దృష్టితో శంకరుడు సప్తర్షులను ప్రేరేపించాడు. వారా వీర్యమును ఆకు దొప్పలో ఉంచారు. సమయాన్ని అనుసరించి దానిని కేసరి భార్యయైన అంజన యొక్క చెవి గుండా ఆమె గర్భములోనికి ప్రవేశపెత్తారు. తత్ఫలముగా హనుమానుడు ప్రకటుడయ్యాడు. *(శివపురాణం రుద్రసంహిత 20 వ అధ్యాయం)


No comments:

Post a Comment