Sunday 10 October 2021

యాదేవి సర్వభూతేషు (1)



దేవి ఉపాసనను నిత్యజీవితంలో ఎలా ఉపాసించవచ్చో తెలుసుకుందాము.


యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ, సర్వత్రా శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు. ఈ విశ్వమంతా శక్తి వ్యాపించి ఉంది. అది అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది.


యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||


సర్వ జీవులలోనూ బుద్ధి రూపంలో ఉన్న తల్లికి నమస్కారాలు.


మనం చాలా సందర్భాల్లో బేరాలు చేస్తాము. ఒక పని చేయించుకున్నప్పుడు ఆ పనికి తగిన మూల్యము చెల్లించము. ఎవరైనా ఏదైనా చిన్న వడ్రంగి పని చేసినా, కూలి పని చేసినా, దానికి కొందరు తగినంత డబ్బు ఇవ్వరు. అంతెందుకు ఇంతే తీసుకోవచ్చు గదా అనేవారు ఎందరో ఉన్నారు. పని చేయించుకున్న తర్వాత కూడా జీతం ఇవ్వని యజమానులు ఎందరినో నేను చూసాను. రెండు నెలలు, మూడు నెలల జీతం తమ దగ్గరే అట్టి పెట్టుకునే యజమానులు/ సంస్థలు సైతం ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడంటే అతనిలో శక్తి రూపంలో ఆ అమ్మవారు వ్యక్తమైంది. అతను చేసిన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వెంటనే ఇవ్వడమే శక్తిని ఉపాసించడం. ప్రతిఫలం ఇవ్వకుండా జాప్యం చేయడం, లేదా తగినంత ప్రతిఫలం ఇవ్వకపోవడం అమ్మవారిని అవమానిచడం.


ఒక వస్తువు కొన్నప్పుడు కూడా బేరం చేస్తారు. ఏ వస్తువును తయారు చేయాలన్నా, దానికి బుద్ధి బలం అవసరం. బుద్ధి అంటే కూడా అమ్మవారే. కనుక ఒక వస్తువుకు తక్కువ విలువ కట్టడం (బేరమాడటం) అమ్మవారిని అవమానించడం.


ఓం శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment