Sunday 10 October 2021

దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌ - తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి జీవితంలోని సంఘటన



బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. మన తెలుగు నేలన ఈ మధ్యకాలంలో నడయాడిన గొప్ప బాల ఉపాసకుల లో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు... వారి జీవితంలోని ఒక సంఘటన.


*దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌*


*దొంగలు దొరలయ్యారు*


ఒకసారి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కొన్ని రోజులు ఖాజీపాలెంలో రాత్రి వేళ పురాణమును చెప్పి ప్రతిరోజూ అర్థరాత్రి సమయాన కాలినడకన చందోలు చేరుతుండేవారు.


అది అడవి మార్గం. ఆ మార్గంలో దోపిడిదొంగలు అధికం. అనుకున్నట్లే శాస్త్రిగారిని దొంగలు వెంబడించసాగారు. శాస్త్రిగారు ముందు నడుస్తుంటే, దొంగలు వెనుక కర్రలతో పరుగులు పెడుతూ ఉన్నారు. ఆయన నడక మాములుగా ఉంటే, ఆయనను దోచుకునేందుకు సిద్దమైన దొంగలు పరుగెడుత్తుతూనే ఉన్నారు. కానీ ఆయనను అందుకోలేక పోతున్నారు.


చివరకు ఒకచోట శాస్త్రిగారు ఆగి వెనుదిరిగి " ఎవరు మీరు?" అని ప్రశ్నించారు.


వెంటనే వారందరూ కర్రలు క్రింద పడేసి నేలమీద సాగిలాపడి, లెంపలు వేసుకుంటూ "అయ్యా! మీ ఒంటిపై తళతళలాడుతున్న ఆభరణాలు దోచుకుందామని దుర్బుద్ధితో వెంబడించాము. మేము దొంగలం. కానీ అదేమి చిత్తమో, మీ మహిమోగానీ, ఏ అడుగుకు ఆ అడుగులో మిమ్ము దోచుకుందామని మైలుదూరము పైగా వెంబడించాము. మిమ్మల్ని కేకలు వేసి భయపెట్టేందుకు మాకు మాట పెగల్లేదు. చేతుల్లో ఉన్న కర్రలు, కత్తులతో మీపై దాడి చేద్దామంటే చేతులు రావు. అసలు ఏమీ తోచకుండానే ఇంత వరకు వెంబడించాము. తమరు దయతలచి క్షమిస్తే మా దారి మేము పోతాము" అని దీనంగా పలికారు.


"మీరు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గౌరవముగా జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది" అని పలికారు శాస్త్రిగారు.


అంతట ఆ దొంగలు " దొరవారూ! మీ ఆన మేరకు మేమందరం నేటితో ఈ నీచవృత్తి వదిలేస్తాము. మా చుట్టుప్రక్కల గల దారిదోపిడీగాండ్లందరినీ హెచ్చరిస్తాము. మిమ్మల్ని కన్నెత్తి చూచేవాడుండడు. ప్రొద్దుపోయింది. పోయి రండి" అని గౌరవముగా వంగి నమస్కారాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ దోపిడీ దొంగలు.


ఆ దొంగలు దోపిడీలు మానుకొని పనులు చేసుకుని జీవించసాగారు.


*సద్గురు కృప మాసపత్రిక నుంచి*


*2018 మే సంచిక*

No comments:

Post a Comment