Thursday 28 October 2021

శ్రీ హనుమద్భాగవతము (60)



నగరవాసులందఱు ఎంతో కలత చెందుట చూసి యువరాజైన అంగదుడు లక్ష్మణుని దగ్గరకు వెళ్ళి ఆదర పూర్వకముగా చరణములకు నమస్కరించాడు. అతనిని చూడగానే భ్రాతృభక్తుడైన లక్ష్మణుని కోపము శాంతించింది. ఆయన యువరాజును హృదయమునకు హత్తుకొని ‘వత్సా! నీవు త్వరగా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళి శ్రీ రాముడు నీపై కోపము పూనియున్నాడు, ఆయన పంపగా నేనిచటకు వచ్చిచ్చానని అని ఆయనతో చెప్పు' అని పలికాడు.


‘చాలమంచి’దని పలికి అంగదుడు వినయపూర్వకముగా చేతులను జోడించి లక్ష్మణుని దగ్గర సెలవు తీసుకుని సుగ్రీవుని వద్దకు వెళ్ళాడు. అంగదుని వలన లక్ష్మణుడు పలికిన క్రోధ పూర్ణములైన మాటలను వినినంతనె సుగ్రీవుడు భయాక్రాంతుడయ్యాడు. వెంటనే అతడు లక్ష్మణుని అనుకూలునిగా చేసుకొనుటకు పవన కుమారుని పంపాడు.


హనుమానుడు లక్ష్మణుని సమీపించి ఆయన చరణములకు భక్తి పూర్వకముగా ప్రణమిల్లి వినయముతో ఇట్లా పలికాడు.


ఏహి వీర మహాభాగ భవద్గృహమశంకితమ్ | 

ప్రవిశ్య రాజదారాదీన్ దృష్ట్వా సుగ్రీవమేవ చ | 

యదాజ్ఞాపయసే పశ్చాత్ తత్సర్వం కరవాణి భోః | (4-5-37, 38)


మహాభాగా! వీరశ్రేష్ఠా! ఎలాంటి సందేహం లేకుండా రండి. ఈ ఇల్లు నీది. లోనికి దయచేసి రాజమహిషులను, మహారాజైన సుగ్రీవుని కలవండి. పిమ్మట నీ ఆజ్ఞనను అనుసరించి మెలుగుతాము.


హనుమానుడు ఎంతో భక్తితో లక్ష్మణుని కరకమలములను ప్ట్టుకొని నగరము గుండా రాజభవనమునకు తీసుకుని వెళ్ళాడు. మధుర భాషిణి యైన తార లక్ష్మణునకు స్వాగతమిస్తూ ‘మీ కార్యమును గూర్చియే సుగ్రీవుడాలోచించుచున్నాడు. దయ యుంచి మీరు అంతఃపురములోనికి వచ్చి ఆయనకు ఆభయమీయండని' పలికింది.

No comments:

Post a Comment