మంత్రులు తండ్రి మరణానంతరము జ్యేష్ఠుడగుట వలన వాలిని వానర రాజ్యమునకు రాజుగా జేసిరి. అతడు సర్వవానర జాతికి మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. అంతేకాక తన ప్రజలను అతడు పుత్రరూపముగా ప్రేమించుచుండెవాడు. ఇట్లా వాలి విశాలమగు కిష్కింధా రాజ్యమును పాలించుచుండగా సుగ్రీవుడు శ్రద్ధాసక్తులతోను వినయవిధేయతలతోను దాసునివలె తన అన్నను సేవించుచుండెవాడు.
వానరరాజైన కేసరి అంజనా దేవి ఇరువురు తమ పుత్రుడైన హనుమానుని వైరాగ్యమును, ఏకాంత ప్రియత్వమును చూసి మిక్కిలిగా చింతిఁపసాగారు. కేసరి వానరయూథపతి, ఋక్ష రాజునకు పరమమిత్రుడై ఉన్నవాడు, అందువలన అతడు హనుమంతుని రాజనీతికోవిదునిగా చేయదలచి పంపాపురానికి పంప నిశ్చయించుకున్నారు. మాతాపితృభక్తుడైన హనుమంతుడు తల్లిదండ్రుల ఆదేశముననుసరించి వారి చరణములకు నమస్కరించి ఆశీస్సుల పొంది పంపాపురమునకు ప్రయాణ మయ్యాడు.
పవనకుమారుడు పంపానగరమునకు వచ్చుచున్నాడనే వార్త వినినంతనె సుగ్రీవుడు ఎదురేగి అతనికి స్వాగతమిచ్చాడు. దేవదుర్లభములైన అతని గుణములు తెలుసుకుని ఉండుటచే వాలి కూడా అతనిని ఎక్కువగా గౌరవించి ఆదరముతో తన దగ్గర ఉంచుకొన్నాడు. హనుమంతుడు విద్వాంసుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, సదాచారపరాయణుడు, సరళత్వము మూర్తీభవించినవాడు, అందువలన వాలి వానిని తన కాంతరంగికునిగా చేసుకున్నాడు. కాని విద్యావారిధియైన కేసరీనందనుడు తన గురు దక్షిణ విషయము ఎప్పుడూ మరువలేదు. అందువలన ఆయన సుగ్రీవునకు అభిన్నమిత్రుడయ్యాడు. సుగ్రీవునకు కూడా ఇతనిపై అతీశయమైన ప్రేమయుండెను.
వజ్రకాయుడైన హనుమంతుడు పంపాపురమునకు వెళ్ళినప్పుడు ఆ పురమునకు నలువైపుల రాక్షసరాజ్యములు ఉన్నాయి. ఒక వైపున శక్తిశాలురైన ఖరదూషణాదుల రాజ్యము, రెండవవైపు దేవద్విజద్రోహియైన రావణుని నిష్కంటక రాజ్యము ఉండేది. వానర రాజైన వాలి సాటిలేని వీరుడు, యోధుడు. అందువలన అసురులందఱు అతనిని చూసి భయపడుచుండేవారు. వారు అతని రాజ్యమున అల్లకల్లోల సృష్టించుటకు సాహసింప లేక పోవుచున్నారు. కాని రాక్షసుల దౌష్ట్యమును ఎఱిగి ఉన్న వాడగుటచే వాలి నిశ్చింతగా దుష్టశిక్షణకై ఎక్కడికిని దూరము వెడలెడివాడు కాడు. హనుమంతుడు పంపాపురమునకు వచ్చిన పిమ్మట అతని చింత దాదాపుగా దూరమయ్యింది. అంజనా దేవి అలౌకికుడైన తన పుత్రునకు రాక్షసులను గూర్చిన కథల నెన్నింటినో చెప్పినది. అందువలన బాల్యము నుండియే హనుమంతునకు రాక్షసులన్న కోపము ఎక్కువగా ఉండేది. అతని దృష్టిలో బడిన ఏ రాక్షసుడు కూడా క్షేమముగా బ్రతికి బయటపడుట అసంభవమే. ఆయన వెదకి వెదకి రాక్షసుల ప్రాణములను తీయు చుండేవాడు. అతని పేరు చెప్పినంతనే రాక్షసులు వణకిపోవుచుండేవారు. హనుమంతుని సరళత్వమును, సాధుత్వమును, సాటిలేనివాని వీరత్వమును, ధైర్యమును, పరాక్రమమును చూసి వాలి చకితుడగుచుండేవాడు.
No comments:
Post a Comment