Sunday, 3 October 2021

వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం



వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం


అనాదిగా కుటుంబంలోని పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాలను ఖచ్చితంగా కొనసాగించాలి. కుటుంబ పెద్దలు కులదేవత (ఇంటిదేవుడు అని కూడా వ్యవహరిస్తారు) గా తరతరాలు ఎవరిని పూజిస్తూ వస్తున్నారో వారిని తప్పక అర్చించాలి. వారు ఆరాధించిన పద్ధతిలోనే పూజించాలి. అందులో మార్పులు చేయడం గానీ, వదిలేయ్యడం గానీ చేయగూడదు. ఒకవేళ కులదేవత తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆరాధన పద్ధతిని తర్వాతి తరాలకు అందించాలి. అలాగే గ్రామదేవత యొక్క ఆరాధన కూడా. తరతరాలుగా మన పెద్దలు కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలను విడిచిపెడితే వారి కోపానికి గురికావల్సి వస్తుంది, పితృశాపం తలుగుతుంది.


మతం మారితే మొత్తం వంశాచారం నాశనమవుతుంది. అది ఒక్కటే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు చెప్పిన మాటలు విని, ఈ ఆచారాలు ఆరాధన పద్ధతులెందుకు? ఇవన్నీ అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు, బాహ్యంలో దీపం వెలిగించుట ఎందుకు? లోపల దీపం వెలిగించాలిగానీ ... లాంటి పిచ్చి మాటలను పట్టుకుని మీ పూర్వీకులు పాటిస్తూ వస్తున్న ఆచారాలను వదిలిపెడితే ఆ వంశం నశిస్తుంది. ఇక మన ధర్మంలోనే అనేక సంప్రదాయాలు. కొందరు శివుడిని పూజించరు, కొందరు విష్ణువును పూజించరు. కొత్తగా ఆ సంప్రదాయాల్లో చేరి మీ కులదేవతను విడిచిపెడితే, మీరు ఇప్పుడు పూజించే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడు. మీ వంశాన్ని ఏ గురువులు కాపాడలేరు. అనేక కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 


నేను చాలామందిని చూసాను. ఇలవేల్పు విష్ణువు ఉంటాడు, కానీ ఇష్టదైవం శివుడు. శివుడిని పూజించవద్దు అనలేదు గానీ ఇలవేల్పును కూడా ఆరాధించాలి. కానీ ఆరాధించరు. అదేమిటంటే శివుడే చూసుకుంటాడు అంటారు. కులదైవం శివుడుగా గలిగిన విష్ణుభక్తులు కూడా ఇలాగే అంటారు. నాకు ఇష్టంలేదు అంటారు. నారాయణుడే కాపాడతారు అంటారు. మరి కష్టాలు వచ్చినా, కులదేవతను విడిచిపెట్టినందుకు మీ ఇష్టదేవతయే కష్టం కలిగించిందని అంగీకరించే ధైర్యం మీకుందా?

బహుసా మీ వంశస్థులంతా ఆ దేవతను పూజిస్తామని మీ పూర్వీకులు ప్రమాణం చేశారేమో ! లేదా ఎప్పుడైనా ఆపదలో ఆ దేవత మీ వంశాన్ని కాపాడిందేమో లేదా కాపాడుతానని ప్రమాణం చేసిందో! 

పూర్వీకులు ఏర్పరిచిన వంశాచారాన్ని పాటించమని చెప్పేవారే, మీతో పాటింపజేసేవారే నిజమైన గురువులు. ఇవన్నీ అక్కర్లేదని చెప్పేవారు అసలు గురువులు కానేకారు.

No comments:

Post a Comment