ఆరాధ్యుడగు శ్రీరామునిపాదపద్మములయందు
తండ్రి ఆజ్ఞను పాలించుటకై శ్రీరాముడు తన సహ ధర్మచారిణి అయిన జనక నందినిని, అనుజుడగు లక్ష్మణుని వెంటనిడుకొని వనమునకు వెళ్ళాడు. ఆయన చిత్రకూటము లోనూ, దండకారణ్యములోనూ పదుమూడు సంవత్సరముల వఱకు ఋషులను సర్వప్రాణులను ధన్యులుగా చేస్తూ సంచరించుచుండేవాడు. అసురులెక్కడైనా తాపసులకు బాధను కలుగజేస్తునారనే వార్తను విన్న వెంటనే శ్రీరాముడు వారిని అచట సంహరించి మునుల ప్రాణములను కాపాడేవాడు.
పదునాల్గవసంవత్సరములో సీతారామలక్ష్మణులు పంచవటిలో సుందరమైన ఒక పర్ణ కుటీరమును నిర్మించుకొని దానిలో నివసింపసాగారు. ఒక దినమున లంకాధిపతియైన రావణుని ప్రేరణనను అనుసరించి మారీచుడు బంగారు లేడియై వారి కుటీరము దగ్గరకు తిరగజొచ్చాడు. సీతా దేవి ఆ అద్భుత మృగమును చూసి ముగ్ధురాలై దానిని తెచ్చి ఇవ్వమని శ్రీరాముని ప్ర్రార్థించినది. శ్రీరాముడు బంగారు లేడి వెంట పరుగెత్తాడు, ఆ సమయములో రావణుడు సీతాదేవిని మోసముతో హరించి లంకలో అశోకవనములో ఉంచాడు.
శ్రీరాముడు లక్ష్మణునితో కలసి జానకిని వెదకుతూ, ఆయా ప్రాంతములలో గల విరాధక బంధాది రాక్షసులను వధిస్తూ ఋష్యమూక పర్వతము వైపునకు వెళ్ళాడు.
సుగ్రీవుడు వాలి భయమువలన ఎల్లపుడు శంకాకులిత స్వాంతుడై ఉండేవాడు. అతడు మంత్రులతో కలిసి పర్వత శిఖరముపై నుండి ఆజానుబాహులు, ధనుర్ధారులు, విశాల నేత్రులు, దేవకుమారులవలె తేజస్సుగలవారు అయిన ఆ ఇరువురు సోదరులను చూసినంతనే భయముచే వణకసాగాడు.
No comments:
Post a Comment