Saturday, 16 October 2021

శ్రీ హనుమద్భాగవతము (48)



తన శరీరముపై బడిన రక్త బిందువులను జూసి మహాముని ఆలోచనామగ్నుడయ్యాడు. కారణమును అన్వేషింపగా పర్వతాకారంలోనున్న మహిషకళేబరము కనబడింది. తన తపోబలముచే మహర్షి ఈ దుష్ట కార్యమును ఎవరు చేసిరో తెలిసికొన్నాడు. వెంటనే ఆయన వాలిని 'అతడు ఈ ఆశ్రమము లోనికి ప్రవేశించినచో అతని తల ముక్కలు ముక్కలు కాగల'దని శపించాడు.


హనుమంతుడు భయపడు సుగ్రీవునితో ఇట్లా పలికాడు. రాజా! మతంగ మహామునిచే వాలికి ఈయబడిన శాపము నాకిపుడు జ్ఞప్తికివచ్చినది. కుపితుడై మహాముని వాలిని ఇట్లు శపించెను.


.....హ్యస్మిన్నాశ్రమమండలే | 

ప్రవిశేద్యది వై వాలీ మూర్ధాస్య శతధా భవేత్ | 

తత్ర వాసః సుభోఒస్మాకం నిరుద్విగ్నోభవిష్యతి | (వా. రా. 4.46.22,23)


"వాలి ఈ ఆశ్రమములోనికి ప్రవేశిస్తే అతని శిరస్సు నూఱువక్కలు అవుతుంది. అందువలన అచటకు వెళ్ళి నివసించటం మనకు ఎంతో శ్రేయస్కరము, ఎట్టి భయము ఉండదు”

వెంటనే సుగ్రీవుడు తనముఖ్యసచిడైన హనుమంతుడు చెప్పిన దానిననుసరించి ఋష్యమూక పర్వతముపై గల మతంగమహాముని ఆశ్రమమునకు వెళ్ళాడు. మహర్షి శాప భయముచే వాలి అచటికి పోజాలకపోయాడు. చేయునది లేక తిరిగి వెళ్ళాడు. 

రాజనీతివిశారదుడైన వాలి పవనకుమారుని ఎంతో గౌరవముతో తన దగ్గఱ ఉంచుకొనదలచుచుండేవాడు, కాని ఆంజనేయుడు సుగ్రీవుని క్షేమమును కోరుచుండేవాడు. సుఖముగా ఉన్నప్పుడు అందఱు చుట్టిముట్టి ఉంటారు. కాని ఆపద వచ్చినపుడు వారు విడచిపోవుదురు, నిమైన మిత్రులు సేవకులె ఆపద సమయంలో ప్రేమతోను భక్తి తోను సహాయపడతారు.


అంజనానందనుడు 'సుఖసమయమున సుగ్రీవునితో కలిసి ఉన్నాడి, ఆపత్కాలమున అతడు సుగ్రీవుని ఎలా విడచివస్తాడు? అతడెల్లపుడు సుగ్రీవునితో నుండి అతని బాగోగులను పరిశీలించుచుండేవాడు. చక్కగ పరామర్శించి, అతనికి ధైర్యము చెప్పుచుండేవాడు. హనుమంతుని ఓదార్పుతో సుగ్రీవుడు కష్టకాలమునందు కూడా సుఖమునే అనుభవించుచుండేవాడు. పవనకుమారుడు తనకు మంత్రియే కాదు, సాటిలేని మిత్రుడు, సోదరతుల్యుడునై ఉన్నాడు..


సర్వస్వము లాగుకొని వాలిచే బహిష్కృతుడైనా సుగ్రీవుడు తన ప్రియసచివుడైన హనుమంతుని వలన ఋష్యమూకపర్వతముపై రాజువలె సుఖముగా కాలము గడుపుచున్నాడు.


ఋష్యమూక పర్వతముమీదకు స్వయముగా రాజాలకుండేవాడు. శాపము వలన వాలి స్వయంగా రాలేకపోయేవాడు. అందువలన అతడు తన వారిని పంపి సుగ్రీవుని చంపే ప్రయత్నం చేసేవాడు. ఈ విషయము సుగ్రీవునకు చక్కగా తెలుస్తుంది కాని అతడు హనుమంతుని శక్తిని పరాక్రమమును, విలక్షణబుద్ధిని గట్టిగా నమ్మి ఉండుటచే నిశ్చింతగా ఉండేవాడు. మహావీరుడైన హనుమానుడు సుగ్రీవుని ఆజ్ఞాపాలనమున ఎప్పుడును తత్పరుడై ఉండేవాడు. సర్వగుణసంపన్నుడైన పవనకుమారుడు తనకు పుత్రునిగానూ, సచివునిగానూ లభించినందులకు సుగ్రీవుడు తన అదృష్టమును ఎల్లప్పుడూ పొగడుకొంటూ ఉండేవాడు.


No comments:

Post a Comment