Wednesday 6 October 2021

శ్రీ హనుమద్భాగవతము (44)



వీరవరులగు వాలి సుగ్రీవుల పరస్పర ప్రేమ వృత్తాంతము అంతట ప్రసిద్ధి చెందియుండేది. వారిరువురు ఎంతో సుఖముగా జీవితమును గడుపేవారు. దైవనిర్ణయము అనుల్లంఘనీయము గదా! వారిరువురూ తమ సహజప్రేమను మరచి ఒకరినొకరు చంపుకొను స్థితికి దైవము వారిని తీసుకుని వెళ్ళింది. దాని వలన వారు పరస్పరము రక్త పిపాసులైయ్యారు.


అపుడు మయునిపుత్రుడైన 'మాయావి' యను దానవుడు గర్వముచే ఉన్మత్తుడై తనతో సాటివచ్చే వీరుని సాటివచ్చువీరుని (ప్రతిభటుని) వెదకుచు తిరుగుచుండేవాడు. ఒక నాటి విషయం. అర్థరాత్రి సమయంలో బలవంతుడైన ఆ అసురుడు కిష్కింధా పురపు పొలిమేరలలోనికి వచ్చి వాలిని సవాలు చేస్తూ భయంకరంగా గర్జిస్తున్నాడు.


పరాక్రమశాలి యైన వాలి శత్రువు పిలుపును వినినంతనె వానిని చంపుటకు ఎల్లప్పుడును సిద్ధముగానే ఉంటాడు. ఆయన గాఢనిద్రలో ఉన్నాడు. అయినా అసురుని సవాలు వినబడినంతనె ప్రక్కనుండి లేచి వెంటనే పరుగెత్తాడు. శత్రువు ఎదుటకు వెళుతున్న అన్నను చూసి సుగ్రీవుడు కూడా ఆయన వెంట వెళ్ళాడు. అలా వాలిసుగ్రీవులిరువురూ రావడం చూసి మాయావి భీతి చెంది వేగంగా పరుగెత్తాడు. సోదరులిరువురు వానిని వెంబడించారు.


చాలా దూరము వెళ్ళిన పిమ్మట గడ్డిగాదముతో గప్పబడి ఉన్న ఒక విశాలబిలాన్ని అతడు చూసీ, వెంటనే దానిలో ప్రవేశించాడు. క్రోధోన్మత్తుడైన వాలి సుగ్రీవుని ఆ బిలద్వారము దగ్గర సావధానముగా ఉండమని చెప్పి తాను లోనికి ప్రవేశించాడు.

No comments:

Post a Comment