Thursday 21 October 2021

శ్రీ హనుమద్భాగవతము (53)



కరుణామయుడైన శ్రీ రాముడు తనకు అనన్యభక్తుడైన హనుమంతుని సహజవానరరూపాన్ని చూసాడు. వెంటనే ఆయన సమీరకుమారుని లేవనెత్తి తన బాహువులతో గట్టిగా హృదయమునకు హత్తుకొన్నాడు. ఆ సమయమున వారిరువురిదశ చాల అద్భుతముగ ఉండింది. ప్రేమమూర్తియు, భక్తవత్సలుడైన శ్రీరాముడు తన అభయహస్తముతో హనుమానుని శిరస్సును నిమురుచున్నాడు. హనుమంతుడు శిశువు వలె మహాప్రభువు హృదయానికి హత్తుకొని రోదిస్తున్నాడు. అతని కంఠము రుద్ధమైపోయింది. 


తన ప్రభువైన శ్రీరామునకు తనపై ప్రేమ ఉన్నదన్న విశ్వాసమేర్పడిన తరువాత హనుమంతుడు లక్ష్మణుని చరణములకు నమస్కరించాడు. సుమిత్రానందనుడు కూడా అతనిని వెంటనే లేవనెత్తి హృదయమునకు హత్తుకొన్నాను. అనంతరము హనుమంతుడు శ్రీరామునకు సుగ్రీవుని వృత్తాంతమును అంతటిని వివరించాడు. నీతినిపుణుడైన పవనకుమారుడు శ్రీ రాముని ముఖారవిందమును నిర్నిమేషదృష్టితో చూస్తూ వినయయుక్తములైన వాక్కులను ఇట్లు పలికాడు - 'దేవా! తన జ్యేష్ఠ సోదరుడైన వాలి భయముతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నాడు. ఇతడు రాజ్యబహిష్కృతుడు, భార్యావియోగముచే ఎంతో దుఃఖితుడైయున్నాడు. అడవులలోను, కొండలలోనూ చాలా కష్టముతో గాలమును గడపుచున్నాడు. మీరు కూడా ఇదియే స్థితిలో ఉన్నారు. ఇపుడు సుగ్రీవునకు సమర్థుడైన స్నేహితుడు అవసరమైయున్నాడు. నీవీయనతో స్నేహము చేసికొఒంటే, ఈ సుగ్రీవునకు ఎంతో సంతోషము కలుగుతుంది. ఆయనకు తన రాజ్యము భార్య మఱల లభించినచో అతడు సీతాన్వేషణమునందు విశేషముగా సహాయపడగలడు. అందువలన నీవు సుగ్రీవుని ఆత్మీయునిగా చేసికొనవలసినదిగా నేను ప్రార్థించుచున్నాను.  


శ్రీరాముని అంగీకారము లభించినంతనే పవనకుమారుడు రామలక్ష్మణులను ఇరువురిని తన భుజములపై కూర్చుండబెట్టుకొని ఋష్యమూక పర్వతముపైకి వెళ్ళాను. శ్రీరామ లక్ష్మణసహితుడై తన వైపు వచ్చు హనుమంతుని చూడగా సుగ్రీవునకు అథిక సంతోషము కలిగింది.

No comments:

Post a Comment