Saturday, 30 October 2021

శ్రీ హనుమద్భాగవతము (62)



'అవును, తప్పక వెళదామూ అని పలికి సుగ్రీవుడు అర్ఘ్యపాద్యాదులచే లక్ష్మణుని పూజించి ఆయనతో పాటు తాను ఉత్తమమైన రథముపై కూర్చున్నాడు. సుగ్రీవునితో పాటు అంగదుడు, నీలుడు, ఆంజనేయుడు మొదలైఅన ప్రధానులైన వానరులు కూడా శ్రీ రాముని దగ్గరకు వెళ్ళారు. అప్పుడు భేరీ మృదంగాది నానా విధములైన వాద్యములు మ్రోగసాగాయి.


సీతాన్వేషణార్థమై పయనమగుట


మృగచర్మము చేత, జటామకుటము చేత శోభిల్లువాడు నీలమేఘశ్యాముడు అయిన శ్రీరాముడు గుహద్వారము దగ్గర ఒక శిలా ఖండముపై కూర్చుని ఉదాసీనమైన మనస్సుతో పక్షులను చూస్తున్నాడు. దూరము నుండి శాంతమూర్తియైన శ్రీరాముడు కనబడగానే సుగ్రీవుడు, లక్ష్మణుడు రథమునుండి దిగారు, సుగ్రీవుడు వేగముగా శ్రీ రాముని వద్దకు వెళ్ళి అజ్ఞానుడైన బాలులు వలె ఆయన పాదపద్మముల పై ప్డి ఏడ్వసాగాడు. దయామూర్తి యైన శ్రీరాముడు వెంటనే అతనిని లేవనెత్తి ఆలింగనము చేసుకుని, సమీపమున కూర్చుండ బెట్టుకుని ప్రేమ పూర్వకంగా అతని యోగక్షేమములల్ను అడగసాగాడు.


సుగ్రీవుడు చేతులజోడించి ఎంతో వినయముతో పలికాడు. 'ప్రభూ ! నా దోషమేమీలేదు. నీ మాయ

చాలా ప్రబలమైనది. నీ దయ ఉంటేగాని దీనిని దాటలేము. నేను భోగాసక్తుడైన పామరపశువును. నా పై దయ చూపు.


కరుణామయుడైన శ్రీరాముడు సుగ్రీవుని శిరమును తన కరకమలముతో నిమురసాగాడు. అప్పుడు అసంఖ్యాకులైన వానర భల్లూక వీరులు అచటికి రాసాగారు.


వారిని చూసి సుగ్రీవుడు శ్రీ రామునితో ఇట్లు పలికాడు. "ప్రభూ! ఈ వానరులు, భల్లూకవీరులు నీ ఆజ్ఞను పాలిస్తారు. ఫలమూలాదులను భక్షిస్తారు. ఈతడు భల్లూకములకు అధిపతియైన జాంబవంతుడు, మహాయోధుడు, బుద్ధి మంతుడు. ఇతడొక కోటిమంది వానరులకు అధిపతి. మంత్రులలో శ్రేష్ఠుడు. ఇంతేకాక నలుడు, నీలుడు, గవయుడు, గవాక్షుడు, గంధమాదనుడు, శరభుడు, మైందుడు, గజుడు, పనసుడు, బలీముఖుడు, దధిముఖుడు, సుషేణుడు, తారుడు, మహాబలుడు పరమధీరుడు హనుమంతుని తండ్రియైన కేసరి వీరందఱు ప్రధానయూథపతులు. వీరి ఆధీనంలో పర్వతములతో సమానమైన విశాలకాయములు కలిగిన వానర వీరులు కోట్లగొలదిగా ఉన్నారు. మీరు వీరిని ఇష్టానుసారముగా ఆజ్ఞాపింపవచ్చును.


No comments:

Post a Comment