Tuesday 26 October 2021

శ్రీ హనుమద్భాగవతము (58)



ఇక అచట వర్ష ఋతువు పిమ్మట శరదృతువు వచ్చెను. సుగ్రీవుడు నిశ్చింతునిగా, నిష్రియునిగా ఉండుట చూసి భగవానుడైన శ్రీరాముడు కలత చెంది తన సోదరునితో ఇట్లా పలికాడు. ‘లక్ష్మణా ! వానరరాజైన సుగ్రీవుడు సీతాన్వేషణమునకు గడువును నిర్ణయించినాడు. కాని తన స్వార్థము నెరవేరిన పిమ్మట దుష్టబుద్ధియైన ఆ వానరుడు నన్ను ఉపేక్షించాడు. నన్ను అతడు రాజ్యభ్రష్టునిగా, దీనునిగా, అనాథునిగను, శరణాగతునిగా భావించి తిరస్కరించుచున్నాడు. అందువలన నీవక్కడికి వెళ్ళి స్పష్టముగా పలుకు – ‘బలపరాక్రమ సంపన్నులు, ఉపకారము చేయునట్టి వారు కార్యార్థులైన పురుషులకు ప్రతిజ్ఞాపూర్వకముగా ఆశను క్లుగజేసి తరువాత దానిని భగ్నము చేయువాడు ప్రపంచంలోనున్న మనుషులందరిలో నీచుడు, తన నోటి ద్వారా ప్రతిజ్ఞారూపంగా వెలువడిన మాటలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు. ఎలా ఉన్నా ఆ వాక్కులు తప్పక నెఱవేర్చదగినవని భావించి సత్యాన్ని కాపాడే ఉద్దేశ్యంతో వాటిని పాటించే వీరుడు మనుష్యులలో శ్రేష్ఠునిగా చెప్పబడుతున్నాడు.

లక్ష్మణా ! ఆ దురాత్మునితో ఇంకను నిట్లు పలుకుము ‘నా బాణముచే జంపబడిన వాలి యే మార్గమున వెడలినాడో ఆ మార్గ మింకను మూతబడలేదు. అపుడు నేను నాలి నొక్కనినే చంపితిని. కాని యిపుడు నీవు నీ ప్రతిజ్ఞను నెఱ వెర్చనిచో బంధువులతో గూడ నిన్ను మృత్యువాతబడ వేయుదును'అని శ్రీరాముడు మిగుల బాధతో తనసోదరునితో బలి


* అర్థినాముపపన్నానాం పూర్వం చాప్యుపకారిణామ్ | 

ఆశాం సంశ్రుత్య యో హంతి స లోకే పురుషాధమః || 

శుభం వా యది వా పాపం యో హ వాక్యముదీరితమ్ | 

సత్యేన ప్రతిగృహ్ణాతి స వీరః పురుషోత్తమః || (వా. రా: 4.80–71,27)  


శ్రీ రాముని వాక్కులను వినినంతనే సుమిత్రానందనుడు రోష పూర్ణుడయ్యాడు, అతడు అన్నపాదములకు నమస్కరించి ఇట్లు పలికాడు - ‘విషయభోగాసక్తుడు, బుద్ధిహీనుడైన వానరుడు అగ్నిసాక్షిగా స్నేహముజేసినాడు; కాని తనపని నెఱవేరిన పిమ్మట అతని అభిప్రాయము మారినది. అసత్యవాదియైన సుగ్రీవుని ఇప్పుడే చంపి అంగదునకు రాజ్యపట్టాభిషేకము చేస్తాను. అతడే రాజై వానరవీరుల ద్వారా సీతా దేవి జాడను తెలిసికొనగలడు.'

No comments:

Post a Comment