Thursday, 14 October 2021

యాదేవీ సర్వభూతేషు (4)



'అపరాజిత స్తోత్రానికి అర్ధం తెలుసుకున్నాం గదా. అందులోనే ఋషులు మనకు సులభోపాయాలు ఎన్నో చెప్పారు . ప్రతి విశేషణానికి ముందు 'యాదేవీ సర్వభూతేషు ______ రూపేణా సంస్థితా' అన్నారు. ఇంతకీ ఈ యాదేవీ అంటే ఏమిటి ? ఏ దేవి అయితే సర్వభూతములయందూ ఈ ఈ విభూతులుగా వ్యక్తమవుతుందో ఆ దేవికి ముమ్మారు నమస్కారములు అన్నారు. ఋషి దేన్నీ వదల్లేదు. సర్వభూతములు అన్నారు, అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం (చిన్న విత్తనం నుంచి బ్రహ్మదేవుని వరకు) అఖిల లోకాల్లో, అనేకరూపాల్లో వ్యక్తమవుతున్న అమ్మవారి విశ్వరూపం చూపెట్టారు. అంటే మనం భగవతి ఉపాసన చేయాలంటే అమ్మవారిని అన్నిటియందు చూడటం నేర్చుకోవాలి.


స్త్రీలోనే అమ్మవారిని చూడాలని కూడా వారు అనలేదు. సర్వభూతాల్లో చూడాలి అన్నారు. అంటే ఎవరిని అల్పంగా చూడరాదు, అవమానించకూడదు. అది జంతువైనా , మొక్కైనా ఏదైనా. ఇక ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్పనవసరం లేదు. 


కులమతలింగ బేధాలను మనం దాటి అంతటా భగవతి చూడగలిగితేనే అది నిజమైన శ్రీవిద్యోపాసన. నిజమైన శ్రీవిద్యోపాసకుడు దేన్నీ అల్పంగా భావించడు. ఎందుకంటే అనేక రూపాల్లో అమ్మ అతని వద్దకు నిత్యం వస్తూ ఉంటుందని భావన చేస్తాడు. 


ఇక్కడ కేవలం జీవుల గురించి మాత్రమే చెప్పలేదు. కార్యకలాపాల గురించి కూడా చెప్పారు చూడండి - నిద్ర, ఆకలి, దాహం, మతిమరుపు వంటి వాటిల్లో కూడా అమ్మవారిని చూడమన్నారు. అది కదా నిజమైన ఉపాసన అంటే. మనం యజ్ఞాలు చేయక్కర్లేదు, జపాలు చేయక్కర్లేదు. చండీ సప్తశతిలో చెప్పినట్లు అమ్మవారిని సమస్త కార్యకలాపాల్లో, విశ్వమంతటా దర్శించగలిగితే చాలు. అంటే ఇక్కడ చండి హోమాలను, జపాలను తక్కువ చెయ్యట్లేదు. కానీ సాటిజీవుల పట్ల ప్రేమను చూపలేనప్పుడు, తన తోటి మానవులను గౌరవించలేనప్పుడు భగవతి ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకించి కర్మలు చేయుట ఎందుకు? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేవాళ్ళు, తల్లిదండ్రులను, కట్టుకున్న ఇల్లాలిని గౌరవించని వాళ్ళు, స్త్రీల పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాళ్ళు భగవతి ఉపాసన చేస్తున్నామని చెప్పుకోవటమంటే అది శుద్ధ అబద్ధమే. నిజమైన దేవి ఉపాసకుడు తాను ఎవరిని దూషించడు, తన వాళ్ళు దూషిస్తే చూస్తూ ఊరుకోడు.    


అదే ఈ స్తోత్రం చెబుతోంది. నిత్యజీవితంలో సర్వావస్థల్లో భగవతిని చూడు. అన్నిటియందు అమ్మవారిని భావన చేసినవాడికి అపజయం ఉండదు. అతడిని భగవతి తనతో సమానంగా చూస్తుంది. కనుక దేవతలు, ప్రకృతి అతనికి అన్ని విజయాలనే ఇస్తాయి (వారి ద్వారా అపరాజిత దేవి అతడిని అపరాజితుడిని చేస్తున్నది). 


ఓం శ్రీ మాత్రే నమః 

No comments:

Post a Comment