మంత్రోపదేశం కావాలని, అమ్మవారిని ఉపాసన అంటే తమకు ఎంతో ఇష్టమని అనేకులు గురువు కోసం అన్వేషిస్తుంటారు. అమ్మవారిని సులభంగా ఉపాసించే పద్ధతులను ఋషులు దేవీ మహాత్యంలోని చండీ సప్తశక్తిలో చెప్పకనే చెప్పారు. అందులోని 'అపరాజితా స్తోత్రం' లోని రెండు పంక్తులు చూడండి.
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: ||
సర్వజీవులయందూ ఆకలి రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమ: ||
సర్వజీవులయందూ దాహం రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారములు.
జీవులలో ఆకలి, దాహార్తి రూపంలో వ్యక్తమయ్యేది కూడా అమ్మవారే అంటున్నారు. ఇదే మనకు భగవద్గీత, శివగీత, గణేశగీతలలో కనిపిస్తుంది. గీతలో భగవానుడు 'అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశిత్రః' అంటాడు. వైశ్వానరుడు అంటే ఆహారన్ని జీర్ణం చేసే అగ్ని, సైన్స్ పరిభాషలో హైడ్రో క్లోరిక్ యాసిడ్.
ఆకలితో ఉన్నవాడికి పట్టేడన్నం పెట్టి అతని కడుపు నింపితే అది అమ్మవారి అర్చన. దాహంతో ఉన్నవాడి దాహం తీరిస్తే అది కూడా అమ్మావారికి చేసే అర్చనయే. భగవతికి ఏ పువ్వులంటే ఇష్టం, ఏ నివేదన అంటే ఇష్టం అని అడుగుతారు. ఆకలి మరియు దప్పికతోనున్న జీవులకు ఆహారం మరియు నీరు అందిస్తే దేవి భగవతి సంతసిస్తుందని దేవీ మహాత్యం చెబుతోంది. ఇంతకంటే సులభమైన పని ఏముంది ?
కాకపోతే వాళ్ళు నిస్సహాయులనే భావనతో లేదా నేను ఇస్తున్నాననే భావన ఇక్కడ పనికిరాదు. జీవులయందున్న భగవతిని ఆహారం మరియు నీరు ద్వారా పూజిస్తున్నానే భావన రావాలి. ప్రతిఫలం ఆశించకుండా, నిష్కామంగా, పవిత్రభావనతో చేయాలి. సెల్ఫీలు తీసుకుని పెట్టడమంటే ప్రదర్శనయే అవుతుంది. నువ్వు ఇలా జీవుల ఆకలిదప్పికలు తీర్చుతున్నావనే విషయం నీకు, పరమేశ్వరికి తప్ప ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. అలా చేసిందే నిజమైన ఉపాసన. మిగితాదంతా బాహ్యప్రదర్శనయే.
ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మగారు చేసింది కూడా ఒక రకమైన దేవీ ఉపాసనయే. అమ్మవారి పారాయణలు చేసినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మ ఆ భక్తుని దగ్గఱకు వస్తూ ఉంటుందని, అందుకే దేవీ ఉపాసకులు నిత్యం అన్నదానం వంటివి చేస్తూ ఉండాలని శ్రీ విద్యలో చెబుతారు. మంత్రం జపిస్తేనే ఉపాసన కాదు, సర్వజీవులలో వ్యక్తమవుతున్న శక్తిని తగిన విధంగా అర్చించడం కూడా ఉపాసనయే.
ఓం శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment