Tuesday 19 October 2021

శ్రీ హనుమద్భాగవతము (51)



‘నేను మీ తేజస్సును స్వరూపమును చూసి చకితుడనగుచున్నాను. సామాన్య రాజకుమారులింతటి తేజస్సు కలిగి ఉండరు. లోకోత్తర తేజోమయ పురుషులైన మీరెవరు? మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరైనా ఒకరా? లేక నరనారాయణులా? లేక సర్వసృష్టికి ప్రభువైన పరబ్రహ్మ పరమాత్మ భూభారహరణార్థమై యుగళరూపమున అవతరించి నన్ను ధన్యునిగా జేయుటకు ఇక్కడకు వచ్చినాడా ?


సంభాషణచతురుడైన హనుమంతుడు ఇట్లా పలికి ఊరుకున్నమీదట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లా పలికాడు. లక్ష్మణా ! ఇతని పాండిత్యపూర్ణమైన స్పష్టోచ్చారణమువలన ఇతడు వ్యాకరణశాస్త్ర పారంగతుడైనట్లు, వేదాధ్యయన సంపన్నుడై నట్లు తెలుస్తోంది. నిజంగా ఇతడు సర్వ శాస్త్రజ్ఞాన సంపన్నుడే; ఎందుకనగా, ఇతడు సంస్కార (వ్యాకరణ నియమానుకూలమగు శుద్ధవాణిని 'సంస్కార సంపన్న'మందురు), క్రమసంపన్నము (శబ్దోచ్చారణకు సంబంధించిన శాస్త్రీయపరిపాటిని 'క్రమం అంటారు), అద్భుతము, అవిలంబితము (ధారాప్రవాహరూపముతో మాటలాడుట 'అవిలంబితం' అనబడుతుంది), హృదయానందకరము, కల్యాణమయము అయిన వాక్కును పలుకుతున్నాడు. హృదయము, కంఠము, మూర్ధము ఈ మూడుస్థానముల ద్వారమున స్పష్టరూపముగా అభివ్యక్తమవుతున్న ఇతని ఈ విచిత్ర వాక్కును వింటే ఎవరి చిత్తము ప్రసన్నముగాదు? వధించుటకు ఖడ్గము నెత్తిన శత్రువు హృదయము గూడ ఇతని అద్భుత వాక్కుచే మారిపోగలదు. 


సంస్కారక్రమ సంపన్నామద్భుతామవిలంబితామ్ | 

ఉచ్చారవతి కల్యాణీం వాచం హృదయహర్షిణీమ్ ॥ 

ఆనయా చిత్రయా వాచా త్రిస్థానవ్యంజనస్థయా | 

కస్య నారాధ్యతే చిత్తముద్యతా సేరరేరపి. || ( వా,రా. 4.8–82,88 ) 


నీవు ఇతనితో మాట్లాడు.


అన్న గారి ఆదేశమును సుమిత్రానందనుడు బ్రాహ్మణ వేషధారియైన పవనకుమారునితో ఇట్లా పలికాడు " "బ్రాహ్మణుడా ! మేమిరువురము ధర్మాత్ముడు, విఖ్యాతుడు, అయోధ్యాధిపతియు అయిన దశరధుని కుమారులము. ఈయన నా అన్న, పేరు శ్రీరాముడు, నా పేరు లక్ష్మణుడు. తండ్రిగారి ఆజ్ఞను అనుసరించి పదునాలుగు సంవత్సరములు అరణ్య వాసము చేయ వచ్చాము. ఇచట పంచవటిలో ఈయన భార్యయౌన సీతా దేవిని రాక్షసుడెవడో మోసముతో హరించినాడు. మేమీ గహనారణ్యములో ఆమెను వెదకుతూ తిరుగుతున్నాము. మీరెవరో దయ యుంచి చెప్పండి” .


పవనకుమారుడు సుమిత్రానందనుడు చెప్పు యుగళ రూపములను గురించి తెలుసుకొనుచున్నాడు. కాని అతని మనస్సు జటాజాలశోభితము, నవనీరదశరీరము గల శ్రీ రాముని ముఖారవిందముపై లగ్నమైయుండెను. భువనమోహనరూపము వాని రోమరోమమున ప్రవేశించుచున్నట్లుండెను. అతని నేత్రముల నుండి భాష్పములు ప్రవహించుచున్నాయి, శరీరము పులకరిస్తోంది. ప్రభువును గూర్చి విన్నపిమ్మట అతనికి తన స్మృతి కూడా లేకపోయింది. అతడు త్రైలోక్యదుర్లభములు, పవిత్రములు అయిన శ్రీరాముని పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము చేసాడు. వ్యాకులుడై ప్రేమాశ్రువులతో భవాబ్ధిపోతములు, పద్మారుణములు అయిన చరణములను ప్రక్షాళనము చేయసాగాడు.

No comments:

Post a Comment