Monday 18 October 2021

శ్రీ హనుమద్భాగవతము (50)



వ్యాకులుడై సుగ్రీవుడు హనుమంతునితో ఇట్లా పలికాడు. వ్యాకులుడై సుగ్రీవుడు హనుమంతునితో ఇట్లా పలికాడు. 'ఈ వీరులను ఇరువురిని చూసినంతనే నా మనస్సు భీతి చెందుతున్నది. ప్రాణశత్రువైన వాలి నన్ను చంపుటకు వీరిని పంపి ఉండవచ్చు, రాజులకు మిత్రులెందఱో ఉంటారు.


అందువలన వీరిని నమ్మరాదు. గూఢవేషమున సంచరిస్తూ శత్రువులను జాగ్రత్తగా గమనించాలి. ఏలయనగా, వారు ఇతరులకు తమపై విశ్వాసమును కలిగిస్తారు. కాని వారెవరిని విశ్వసించరు. సమయము వచ్చినప్పుడు ఆ నమ్మినవారిపై దెబ్బదీస్తారు. 


ఆరయశ్చ మనుష్యేణ విజ్ఞేయాళ్ఛద్మచారిణః |  

విశ్వస్తానామవిశ్వస్తాశ్ఛిద్రేషు ప్రహర న్త్యపి ॥ ( వా.రా. 4.2.22 )  


వాలి దీనిలో చాలా సమర్థుడు. అందువలన కపిశ్రేష్ఠా ! నీవు సామాన్య వ్యక్తి వలె వారి దగ్గరకు వెళ్ళి వారిని గుఱించి, వారి మనోభావములను గుఱించి తెలిసికొనుము. వీరు వాలిచే పంపబడినవారైతే నీవక్కడ నుండియే సూచన చేయ్యి. నేను మంత్రులతో గూడి ఈ పర్వతమును విడచి మఱియెచ్చటికైనా శీఘ్రముగా వెళ్ళి తలదాచుకొంటాను.


తనకు ప్రాణప్రియులు, మహాధనుర్ధారులు, శ్యామగౌర వర్ణులైన శ్రీరామలక్ష్మణులను పవనకుమారుడు గుర్తింపక పోవుచుండెను. కాని ఆయన దక్షిణ పార్శ్వము అదరుచుండెను, నేత్రములనుండి ప్రేమాశ్రువులు ప్రవహించుచున్నాయి. హృదయము మాటిమాటికి ఆయన వైపునకు ఆకృష్టమవుతోంది.


వానర శ్రేష్ఠుడైన సుగ్రీవుని ఉద్దేశ్యము ఎఱింగి పవన కుమారుడు ఋష్యమూక పర్వతమునుండి ఎగురుతూ వెళ్ళాడు. త్రోవలో అతడు బ్రాహ్మణ వేషమును ధరించాడును. అభూత పూర్వము, అశ్రుత పూర్వము అయిన సౌందర్యముతో గూడిన శ్రీరామలక్ష్మణులను దర్శించినంతనే హనుమంతునికు ఒక విచిత్రమైన పరిస్థితి కలిగింది. ఆయన శిరము వారి చరణముల మీదకు వంగింది. పిమ్మట ఆయన చేతులు జోడించి మనస్సునకు ఎంతో సంతోషమును గలుగజేసే వాక్కులను ఇట్లు పలికాడు- వీరవరులారా ! శ్యామగౌరవర్ణులుగాను, మిక్కిలి సుందరముగాను ఉన్న మీరెవరు ? నిజంగా మీరు వీరపుంగవులైతే క్షత్రియ కుమారులేనా? కాని మీరు ఎంతో కోమలముగా నున్నారు. ఈ ప్రదేశము పర్వతమయమును, మహారణ్యమును, మహాభయంకరమునై యున్నది. అంతటా వ్యాఘ్రాది కూరమృగములు సంచరించుచున్నవి. త్రోవ రాళ్ళతోను, ముళ్ళతోను నిండి ఉన్నది. మీకిది సంచరింపదగిన భూమికాదు. అయినా మీరెదుకు ఈ నిర్జన వనములో సంచరించుచున్నారు!.


No comments:

Post a Comment