Saturday 9 October 2021

శ్రీ హనుమద్భాగవతము (46)



స్వార్థపరుడైన నా ఈ సోదరుడు నా భార్యను, రాజ్యాన్ని పొందదలచి బిలద్వారమును బండరాతితో కప్పివేసినాడు, దానివలన నేను బయటకు రాలేక లోపలే మరణిస్తానని అతని ఊహయై ఉండవచ్చూ అనే ఆలోచన మనస్సు లోనికి వచ్చిన వెంటనే నేయి పోయగానే భగ్గుమని లేచే అగ్నివలె వాలి క్రోధోన్మత్తుడయ్యాడు.


క్రోధారుణలోచనుడైన తన అన్నను చూసినంతనే సుగ్రీవుడు అతని రాజ్యాన్ని అతనికిచ్చి వేసి, నిజం చెప్పే ప్రయత్నం చేసాడు, కాని ‘మహాక్రుద్ధుడైన వాలి సుగ్రీవునకు బద్ధశత్రువయ్యాడు. అతడు రాజ్యముతో పాటు సుగ్రీవుని భార్యయైన రుమను కూడా లాగుకొని, సుగ్రీవుని వధింపదలంచాడు. సుగ్రీవుడు ప్ర్రాణరక్షణార్థమై మంత్రులతో క్లసి పాఱిపోయాడు.


భయకంపితుడైన సుగ్రీవుడు పరుగెత్తుచున్నాడూ. వాలి అతనిని చంపదలచి వెంటబడ్డాడు. నదులను, నదములను, వనములను, పర్వతములను, సముద్రములను, నగరములను దాటుతూ సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. ఎక్కడా కూడా ఒక్క రోజైన నిలబడటానికి అతనికి ధరియం లేకపోయింది. వాలి ప్రాణఘాతకుడైన శతృవు వలె వెంబడిస్తున్నాడు.

అట్లా పరుగెడుతూ సుగ్రీవుడు హిమాలయమును, మేరువును, ఉత్తరసముద్రమును సమీపించాడు. అయినా వాలి అతనిని విడువలేదు. సుగ్రీవునకు ఎవ్వరూ అభయమిచ్చేవారు కనబడకపోయారు. అప్పుడు అతని వెంట నిరంతరము నీడవలె ఉన్నవాడు జ్ఞానులలో శ్రేష్ఠుడైన హనుమంతునకు దుందుభివధను గూర్చిన ఘటన జ్ఞాపకమునకు వచ్చింది.


మహిష వేషములో ఉండే దుందుభి అనే దైత్యుడు వేయి ఏనుగుల బలముగలవాడు. తాను గొప్పశక్తివంతుడననే గర్వము అతనికి ఎక్కువగా ఉండేది. ఒకనాటివిషయము, దుందుభి సముద్రుని, హిమవంతుని తిరస్కరించి గర్జిస్తూ వీరశిరోమణియైన వాలితో యుద్ధము చేయుటకు కిష్కింధా పురపుపొలిమేరలలోనికి వచ్చి బిగ్గరగా దుందుభి ధ్వనివలె గర్జింపసాగాడు. దుందుభి తన గిట్టలతో భూమిని త్రవ్వుతూ, వృక్షములను నాశము చేస్తూ, పురద్వారమును కొమ్ములతో విరుగగొట్ట యత్నిస్తూ యుద్ధమునకు ఆహ్వానించసాగాడు.

No comments:

Post a Comment