Friday, 29 October 2021

శ్రీ హనుమద్భాగవతము (61)



అంతఃపురమున భయపడుతున్న సుగ్రీవుడు తన భార్య యైన రుమతో కలిసిలక్ష్మణుని చరణములకు నమస్కరించాడు, అచట కూడా క్రుద్ధుడై యున్న లక్ష్మణునితో నీతివేత్తయైన సమీరకుమారుడు ఇట్లు పలికాడు.


త్వత్తో ఒధికతరో రామే భక్తోఽయం వానరాధిపః || 

రామ కార్యార్థమనిశం జగత విస్మృతః | 

ఆగతాః పరితః పశ్య వానరాః కోటిశః ప్రభో || 

గమిష్యంత్యచి రేణైవ సీతాయాః పరిమార్గణమ్ | 

సాధయిష్యతి సుగ్రీవో రామకార్యమశేషతః ||


(వా. రా. 4-5-54, 56) 


'మహారాజా ! ఈ వానర రాజు శ్రీరామచంద్రునకు నీ కంటెను గొప్ప భక్తుడై ఉన్నాడు. శ్రీరామకార్యార్థమై ఆయన రేయింబవళ్లు మేలుకొని ఉంటున్నాడు. ఆయన దానినేమాత్రము మఱచియుండలేదు. ప్రభూ! చూడుము కోట్లకొలదిగా ఉన్నఈ వానరులు దీనికోసమే అన్ని వైపుల నుండి వచ్చుచున్నారు. వీరందఱు శీగ్రముగా సీతాన్వేషణకై వెళతారు. మహారాజైన సుగ్రీవుడు శ్రీరామచంద్రుని సర్వకార్యమును చక్కగా నెరవేర్చగలడు !


అనంతరము వానరరాజైన సుగ్రీవుడు లక్ష్మణుని చరణములకు నమస్కరించి వినయముగా ఇట్లా పలికాడు - 'ప్రభూ ! నేను శ్రీరామచంద్రుని దాసుడను. ఆయనయే నా ప్రాణములను కాపాడినాడు. ఈ ధనము, వైభవము, రాజ్యాదులు సర్వము ఆయన ఇచ్చినవే. ఆయన స్వయముగా త్రిభువనములను జయించగలడు. నేనాయన కార్యమునకు సహాయక మాత్రుడనవుతాను. విషయలోలుడను, పామరుడను అయిన నేను పూర్తిగా మీ వాడనే. అందువలన నీవు నా అపరాధ ములను క్షమించు.


సుగ్రీవుని ప్రార్థన వినినంతనే సుమిత్రానందనుడు అతని భుజములను పట్టుకొని హృదయమునకు హత్తుకొని, ప్రేమ పూర్వకముగా అతనితో నిట్లుపలికెను 'మహాభాగా ! నేను కూడా ప్రణయ కోపవశములో ఏవియో మాటలను పలికాను. వాటిని గూర్చి నీవు ఆలోచించవలదు. శ్రీరాముడు అరణ్యమున ఒంటగా ఉన్నాడు. సీతాదేవి వియోగముచే వ్యాకులుడై ఉన్నాడు. అందువలన ఇప్పుడు ఆయన దగ్గరకు మనము వెళ్ళాలి.

No comments:

Post a Comment