ఆంజనేయుని అశ్రుప్రవాహమునకు విరామము లేకపోయింది, కంఠము గద్గదమయ్యింది. ఎట్లో ధైర్యము వహించి, చేతుల జోడించి ఇట్లా ప్రార్థించాడు. 'దయోనిధివైన ప్రభూ! పామరుడైన నేను నిన్ను గుర్తింపలేకపోయాను; ఇది స్వాభావికమైన విషయము, కాని నీవు అజ్ఞునివలె ఇట్లా ప్రశ్నించితివేమి? నీవు నన్ను మరచితివా? మూడులోకములకు రక్షకములైన నీ చరణకమలములు తప్ప నాకింకొక ఆధార మేమి ఉన్నది. దయానిధీ ! నాపై దయచూపు, నన్ను నీవానినిగా చేసుకొనుము'
నిజంగా లోకత్రయ పవిత్రుడైన శ్రీ రాముడు దయా నిధియే. మిక్కిలి పవిత్రములైన ఆయన పాదపద్మముల పరాగముచే కరుణావారిధి ప్రతిక్షణము ఉప్పుంగుతునే ఉంటుంది. కాని అతనికి మోసమన్న గిట్టదు. ఆవరణముచే అతని దర్శనము సంభవముకాదు. పరమోదారుడగు సీతావల్లభుడు ఎల్లపుడు నిష్కపటునిగాను, సరళహృదయునిగాను కనిపిస్తాడు. పవనకుమారుడు బ్రాహ్మణ వేషమున వచ్చినాడు, ఆయన తన వాస్తవిక స్వరూపమును కప్పివేసినాడు. అందువలన కమలనయనుడైన శ్రీరాముడు ఆయనవైపు కనులార్పకుండగా చూస్తూ పూర్తిగా మౌనముగా ఉన్నాడు.
మారుతాత్మజుని అధైర్యము పెరుగుచుండెను. వ్యాకుల చిత్తుడై రోదిస్తూ అతడిట్లా ప్రార్థింపసాగాడు - ప్రభూ! నేను మోహగ్రస్తుడను, అజ్ఞానాంధకారంలో పడియున్న వాడను, కుటిలహృదయుడను, పైగా నీవు నన్ను విస్మరించావు. ఇక నా స్థితి ఏమని చెప్పను? దయామయా! నాపై ఇక దయజూపు -
ఏకు మైఁ మంద మోహబస కుటిల హృదయ అగ్యాన\ |
పుని ప్రభు మోహి బిసారే ఉ దీనబంధు భగవాన ॥
( రామచరితమానసము 4-2 )
ప్రభువు ఎదుట అశాంతచిత్తముతో ప్ర్రార్థించు హనుమంతుడు తన్ను తాను మఱచిపోయాడు. అతనికి తాను ధరించిన వేషమును గూర్చిన జ్ఞానము కూడా లేకపోయింది. అతని బ్రాహ్మణ వేషము తొలగిపోయింది - అతడపుడు వాస్తవమైన తన వానర రూపముతో ప్రభువు చరణములపై బడి రోదిస్తూ ప్రార్థించుచున్నాడు.
No comments:
Post a Comment