Sunday, 31 October 2021

శ్రీ హనుమద్భాగవతము (63)



సర్వశక్తి సంపన్నుడైన రఘునాథుడు సుగ్రీవునితో ! నా కార్యము గురించి నీకు తెలుసు. ఉచితమని భావిస్తే శీఘ్రముగా వీరిని సీతాన్వేషణమునకై పంపుమని పలికాడు.


సావధానముగా అంతటా తిరుగుతూ సీతా దేవి జాడను తెలుసుకొనవలసినదని యూథపతులకు అందఱకి ఆజ్ఞ ఇస్తూ సుగ్రీవుడిట్లు పలికాడు -- 


విచిన్వంతు ప్రయత్నేన భవంతో జానకీం శుభామ్ | 

మాసాదర్వాజ్ నివరధ్వం మచ్ఛాసనపురస్సరాః || 

సీతామదృష్ట్వా యది వో మాసాదూర్ధ్వం దినం భవేత్ | 

తదా ప్రాణాంతికం దండం మత్తః ప్రాప్స్యథ వానరాః ||


(ఆ రా. 4–8–25,28)


నా ఆజ్ఞ అనుసరించి మీరందఱు ఎంతో ప్రయత్నముతో జానకీ దేవిని అన్వేషించండి, ఒక మాసములోపల తిరిగి రండి. సీతాదేవిని చూడకుండా మాసముకంటే అధికముగా ఒక్క రోజు గడిచినా నా చేతులో మీకు ప్రాణదండన తప్పదు”.  


ఇట్లు సుగ్రీవుడు సీతా దేవిజాడను తెలుసుకొనుటకై వానర యూథపతులను, భల్లూక యూథపతులను కఠినముగా శాసించాడు. అతడు సర్వదిక్కులకు ఎందరినో వానరులను "పంపి దక్షిణదిక్కునకు గొప్ప ప్రయత్నముతో మహాబలుడు యువరాజైన అంగదుడు, జాంబవంతుడు, హనుమానుడు, నలుడు, సుషేణుడు, శరభుడు, మైందుడు, ద్వివిదుడు మొదలైన వారిని పంపాడు. అప్పుడు అతను వీరవరుడగు హనుమానుని ప్రశంసిస్తూ ఇట్లా పలికాడు.


"కపి శ్రేష్టా ! పృథివిలోగాని, అంతరిక్షమునందుగాని, ఆకాశమునందు గాని, దేవలోకమునందు గాని, జలమునందు గానీ నీగతికి అవరోధమున్నట్లు నాకెక్కడా కనపడలేదు. అసుర గంధర్వ నాగ మనుష్య దేవ సముద్ర పర్వత సహితముగా సర్వలోకముల గుఱించి నీకు తెలుసు. వీరుడా! అంతట అబాధిత మగు గతి, వేగము, తేజస్సు, స్ఫూర్తి అనే గుణములన్నీ మహాపరాక్రమవంతుడైన నీ తండ్రియైన వాయు దేవునిలో ఉన్నట్లు నీలో ఉన్నవి. ఈ భూమండలమున ఏ ప్రాణియు నీ తేజస్సుతో సరిపోయినట్టిది లేదు. అందువలన సీతా దేవి లభించునట్టి ఉపాయమును నీవే ఆలోచించు. హనుమానుడా! నీవు నీతిశాస్త్ర నిపుణుడవు. నీ ఒక్కని యందే బలము, బుద్ధి, పరాక్రమము, దేశకాలనుసరణము, నీతియుక్తమైన నడవడి ఒక్క మారే కనబడుతుంది.”

( న భూమా నాంతరిక్షేవా నాంబరే నామరాలయే | 
నాప్సు నా గతిభంగం పశ్యామి హరిపుంగవ ||
సాసురాః సహగంధర్వాః సనాగనర దేవతాః | 
విదితాః సర్వలోకాస్తే ససాగరధరాధరాః || 
గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవం చ మహాకపే | 
చితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజసః || 
తేజసా వాపి తే భూతం న సమం భువి విద్యతే | 
తన్మయా, లభ్యతే సీతా తత్త్వమేవాను చింతయ ||
త్వయ్యేవ హనుమన్న స్తి బలం వృద్ధిః పరాక్రమః | 
దేశాకాలాను వృత్తిశ్చ నయశ్చ నయపండిత || 
(వా. రా. 4-44-3, 7)

No comments:

Post a Comment