Wednesday, 27 October 2021

శ్రీ హనుమద్భాగవతము (59)



ధనుర్బాణములను తీసుకుని సుగ్రీవవధకై బయలు దేరిన లక్ష్మణుని చూసి ధీరుడు, గంభీరుడు, పురుషోత్తముడు అయిన శ్రీరాముడు సోదరునకు నచ్చజెప్పుచు ఇట్లు పలికాడు - 'లక్ష్మణా ! నీ వంటి ఉత్తమవీరుడు మిత్రవధవంటి నిషిద్ధకర్మ చేయుట ఉచితముగాదు. ఉత్తమమైన వివేకముద్వారా తన క్రోధమును చంపుకున్న వీరుడు సర్వపురుషులలోను శ్రేష్ఠుడని చెప్పబడతాడు. 

కోపమార్యేణ యో హంతి స వీరః పురుషోత్తమః || (వా.రా. 4-81-8) 


నాయనా! సుగ్రీవుడు నాకు మిత్రుడు. అతనిని నీవు చంపకూడదు. అక్కడకు వెళ్ళి 'వాలివలె నీవు కూడా చంపబడుదువూ అని మాత్రము పలికి అతనిని భయపెట్టవలసినది. 'శీఘ్రముగా దానికి సమాధానము తీసుకునిరా.


న హంతవ్య స్త్వయా వత్స సుగ్రీవో మే ప్రియః స్సభా 

కింతు భీషయసుగ్రీవం వాలివత్వం హనిష్యసే 

ఇత్యుక్త్వా శీఘ్రమాదాయ సుగ్రీవం ప్రతిభాషితమ్||


(వా. రా. 4–5–18,14)


అలాగే అని ఇక్ష్వాకు కులసింహుడు వీరవరుడైన సుమిత్రానందనుడు శ్రీరాముని చరణములకు నమస్కరించి, భయంకరమైన తన ధనుర్బాణములను తీసుకుని కిష్కంధకు వెళ్ళాడు. అపుడు క్రోధమువలన అతని ఆకారము ఎంతో భయావహముగా ఉండింది. అతని అధరము వణకుచుండింది. అత్యధికమైన కోపముతో అతడు మార్గములో గల వృక్షములను పడగొట్టుతూ, పర్వతశిఖరములను దూరముగా విసరుతూ వెళుతున్నాడు. ఆ సమయమున అతడు ప్రలయంకరుని వలె కనబడుతున్నాడు.


కిష్కంధ దగ్గరకు వెళ్ళి లక్ష్మణుడు తన వింటినారిని భయము గొల్పునట్లుగా మ్రోగించెను. ఆ సమయమున కొందఱు సామాన్యవానరులు కోటగోడపై నుండు రాళ్ళను చెట్లను దీని కొని హర్ష ధ్వానముల చేయసాగారు. ఇది చూచినంతనే లక్ష్మణుని క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. ప్రళయాగ్నివలె నున్న లక్ష్మణుడు విశాలమైన తన ధనుస్సుపై భయానకమైన బాణమును ఎక్కుపెట్టాడు. వెంటనే కిష్కింధలోని వానరవీరులందరు వణకి పోయారు. లక్ష్మణుడు సమూలముగా కిష్కింధను నాశము చేయటకు సిద్ధపడ్డాడు.

No comments:

Post a Comment