Saturday, 23 October 2021

శ్రీ హనుమద్భాగవతము (55)



అంగదస్తు కుమారోయం ద్రష్టవ్యో జీవపుత్త్రియా ! 

ఆయత్యాం చ విధేయాని సమర్థాన్యస్య చింతీయ ॥ (వా. రా. 4-21-4)


“నీ పుత్రుడు అంగదుడు జీవించియున్నాడు. ఇపుడు నీవు ఇతనిని చూసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో ఇతని ఉన్నతికి సాధకములైన శ్రేష్ఠకర్మలను గూర్చి ఆలోచించు”. 


వాలికి అంత్యసంస్కారము జరిగినది. లక్ష్మణుడు కపిరాజైన సుగ్రీవుని కిష్కింధాధిపతిగా చేసాడు. విధివిధానముగా పట్టాభిషేకము జరిగినది. వాలి పుత్రుడైన అంగదుడు యువరాజయ్యాడు. సుగ్రీవునకు సంపద, రాజ్యము, భార్య మున్నగు అభీష్టవస్తువులన్నియు లభించాయి. సర్వులకు శరణ్యుడగు శ్రీరాముని కృపయున్న మానవునకు లోకమున లభించనిది ఏమి ఉంటుంది?


సుగ్రీవుడు కిష్కింధలో నివసింపసాగాడు. కాని పిత్రాజ్ఞపై ఆదరము గలవాడుగుటచే శ్రీ రాముడు నగరములోనికి ప్రవేశించలేదు. ఆయన మాసచతుష్టయమును గడుపుట కోసం ప్రస్రవణ పర్వతమునకు వెళ్ళాడు.


ఆంజనేయుడు ప్రతిక్షణము తనకు ఆరాధ్యుడైన శ్రీ రాముని చరణముల దగ్గరనుండుటకు కభిలషించుచుండేవాడు. కాని సుగ్రీవుడిప్పుడిప్పుడే రాజపదవిని అధిష్టించి ఉండుటచేత కార్య నిర్వహణార్థమై నిపుణుడగు ఒక మంత్రి అతనికి అవసరమై యున్నాడు. ఆ కారణముచే లోకోపకారియైన శ్రీ రాముడు సుగ్రీవునకు సహాయపడవలసినదిగా హనుమాను ఆజ్ఞాపించెను. ప్రభువు ఆజ్ఞ హనుమానునకు శిరోధార్యమయ్యింది. అతడు కిష్కంధలో సుగ్రీవుని దగ్గరే ఉండసాగాడు.


No comments:

Post a Comment