Sunday 24 October 2021

శ్రీ హనుమద్భాగవతము (56)



హనుమంతుడు సుగ్రీవునకు హితము చెప్పుట 


శ్రీరాముడు భార్యయైన సీతాదేవిని గూర్చి చింతిస్తూ సోదరుడైన లక్ష్మణునితో కలసి ప్రస్రవణగిరిపై వర్షాకాలమును గడుపుచున్నాడు. కపిరాజగు సుగ్రీవుడు సంపదను, రాజ్యమును తన భార్యయగు రుమను, అనింద్యసుందరి యైన తారను పొంది సుఖముగా ఉన్నాడు. అతడు ఏ విధమగాను చింత లేనివాడై రాజ్యభోగములను అనుభవించుచున్నాడు. తనకు పరమ హీతైషషీ, సోదరసహితుడైన శ్రీరాముని మైత్రిని, ఆయన ఉపకారమును, ఆయనకు తాను చేయవలసిన కార్యమును పూర్తిగా మరచి సుగ్రీవుడు రాజ్యసుఖములలో మగ్నుడైపోయాడు, కాని పవనపుత్రుడైన హనుమానుడు శాస్త్రసిద్ధాంతములను చక్కగా ఎఱిగినవాడు. కర్తవ్యాకర్తవ్య జ్ఞానము కూడా చక్కగా గలవాడు, సంభాషణ కళాచతురుడైన హనుమంతుడు ఎల్లప్పుడూ సావధానముగా ఉండే మంత్రియై ఉన్నాడు.

'ఆయన ఎల్లప్పుడు శ్రీరాముని ధ్యానమున మగ్నుడై ఉన్నాడు, జగన్మాతయైన సీతా దేవియొక్క జాడను తెలిసుకొనుటకు ఆయన ఎంతో వ్యగ్రుడైయ్యాడు. 


ఆకాశము స్వచ్ఛముగా, నదులలోని నీరు నిర్మలముగా, మార్గములు యాత్రకు యోగ్యములుగా ఉన్నట్లు హనుమంతుడు తెలిసికొన్నాడు. కాని వానర రాజైన సుగ్రీవుడు తన ప్రయోజనము నెఱువేరిన పిమ్మట ధర్మార్థ సంగ్రహమున సుదాసీనుడయ్యాడు, అభిలషితములగు మనోరథములను పొంది స్వేచ్ఛాచారియయ్యాడు. అప్పుడు హనుమంతుడు సుగ్రీవుని దగ్గఱకు వెళ్ళి సత్యము, ప్రియము, హితము అయిన వాక్కులను ఇట్లు పలికాడు.  


No comments:

Post a Comment