ఈ సందడిలో తేరుకున్న మునులు నలువైపులా దృష్టి సారించారు. శిష్యులు చెప్పింది నిజమే. నందనవనంలా మారింది నైమిశారణ్యం. ఇది అంతా స్వామి సాక్షాత్కార మహిమ అని గ్రహించారు. జరిగినదంతా శిష్యులకు వివరించారు. మా అదృష్టమే అదృష్టమంటూ పరవశించిపోయారు. వటువులకు ఒకవైపు ఆనందం ఒకవైపు దుఃఖం పొంగివచ్చాయి. తమ గురువులకు స్వామి సాక్షాత్కారం లభించినదని ఆనందమూ, తాము ఆ సమయంలో లేకపోయామే అనే దుఃఖమూ పొంగివచ్చాయి. సరిగ్గా ఇదే సమయానికి మనం అడవికి వెళ్ళాలా, ఎంత దురదృష్ట వంతులం. అయ్యయ్యో మళ్ళీ ఎన్ని జన్మలకి ఈ అవకాశం లభిస్తుంది. ఇంత కాలంగా చేస్తున్న వేదాధ్యయనం ఆశ్రమ సేవ, జపతపములు. గురుసేవ పరిపక్వం కాలేదు కాబోలు అని దుఃఖించారు. అలా విలపిస్తున్న శిష్యులను మునులందరూ జాలిపడి ఓదార్చారు. పరిపరివిధాలుగా, "మీ గురు శుశ్రూష ఫలం వృధాగా పోదు. శిష్యులు కనుక మా పుణ్యంలో మీకూ భాగం ఉంటుంది. సత్సాంగత్యం, సత్సలాలను ప్రసాదిస్తుంది. సమయం వచ్చినపుడు మీకూ ఆ ఫలాలు దక్కుతాయి. పరాత్పరుడు కటాక్షిస్తాడు.” అని ఊరడించేసరికి శిష్యులంతా ఊరడిల్లారు. సాయాహ్న విధులను ముగించుకొని ఎవరి కుటీరములలోకి వారు వెళ్ళి విశ్రమించారు.
నైమిశారణ్యమునకు సూతమహర్షి రాక
తెల్లవారింది. సూర్యునితోపాటు సూతమహర్షి ఆశ్రమానికి వచ్చేశాడు. ఆశ్చర్య చకితులైనారు అంతా. ఆశ్రమ నియమాలకు అనుగుణంగా అర్ఘ్య పాద్యాదులతో స్వాగతసత్కారాలు జరిపారు. మునులంతా మహానుభావా ! సకల పురాణవేత్తవు. సర్వాగమ విశారదుడవు. సకలశాస్త్రకోవిదుడవు, వ్యాసభగవానునికి ఆప్త శిష్యుడవు శ్రీమన్నారాయణుని భక్తుడవు. ఈ సృష్టిలో నీకు తెలియని విద్యలేదు. ధర్మశాస్త్రాల వాదోపవాదాలకు వేద పురాణముల మధ్యనున్న సంశయాలన్నింటికి తుది తీర్పు నీదే, నీ రాక కేవలం పరమేశ్వర అనుగ్రహమే. లోగడ ఎన్నో పురాణాలని వినిపించి మమ్మల్ని ఎంతో ధన్యులను చేశావు. ఇప్పుడు నీ నుండి దత్తమహాత్మ్యాన్ని వినాలని కుతూహలంగా వుంది. ఇది నారాయణుని ఆజ్ఞ కూడా. దయచేసి వినిపించు. రోమాంచితంగా వినిపించే సామర్థ్యం నీకువుంది. దత్తుడెవరు? ఆయన జన్మకర్మల వృత్తాంతాలేమిటి? యోగనిష్టాగరిష్టుడై బాల, ఉన్మత్త, పిశాచ, స్థితులు, దిగంబర, జడాకారుల స్థితులలో సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరీక్షిస్తాడని విన్నాం. ఆ లీలలన్నీ తెలియజెయ్యి. దత్తనామాలు, స్తోత్రాలు, మహిములు, భక్తుల గాధలు, భక్తులు తరించిన వైనాలు సమగ్రంగా మాకు తెలియజేయ్యి. వాసుదేవుడు ఇన్ని అవతారాలనూ ఎందుకు ధరించినట్లు? ఆయన యొక్క అసలు సత్య స్వరూపం ఏమిటి? సగం తెలిసీ తెలియక అవస్థపడుతున్నాం. నీవు సర్వజ్ఞుడవు దిట్టవని నారాయణుడి ఆనతిచ్చాడు. కనుక దయజేసి వివరించు. ఇలాంటి పుణ్యగాధలు విన్నవారికే కాక, వినిపించిన వారికీ పుణ్య ముంటుంది అంటారు. సూత మహర్షి! నీ వంటి సకల వేదశాస్త్ర సమన్వితుడు ఏదుటికి వస్తే ఏమనడగాలో మాకు తెలియదు. అందుచేత మా ఆర్తి, తాపము, ఉపశమించేట్టు ఏదిఏది ఎంత చెప్పాలో నిర్ణయించుకొని వినిపించవలసినవన్నీ వినిపించు. భుక్తి ముక్తిదాయకము, యోగవిద్యా ఫలదాయకమూ అయిన దత్త మహిమను ప్రధానంగా నీ నోటి నుండి వినాలనేది మా అందరి అభీష్టము. దయచేసి మా కోరిక తీర్చు.