Thursday, 15 December 2022

భేతాళ కథలు - 16



వితంతువా, ముత్తయిదువా?


చంపానగరంలో కపిలుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతనికిద్దరు కొడుకులు. అన్నదమ్ములిద్దరూ ఒకమ్మాయినే ప్రేమించారు. ఎవరికివారికే తానే ఆమెను పెళ్లాడాలనే పట్టుదల పెరిగిపోయింది. ఇద్దరూ ఆమె దగ్గరకు వెళ్లారు. ఆమె విషయం విన్నది. "మీరిట్లు పంతం పట్టడం భావ్యంకాదు. మీరిద్దరూ ఒక నిర్ణీత స్థలంనుంచి బయలుదేరి -నియమిత కాలంలో పరుగెత్తండి. ఎవరెక్కువ దూరం పరుగెడతారో వారినే నేను వరిస్తాను' అంది తానుకూడా ఎటూ తేల్చుకోలేక.


ఆ పందెంలో అన్నదమ్ములిద్దరూ సమానంగా వచ్చారు. అందుచేత సమస్య మళ్లీ మొదటికే వచ్చింది. అప్పుడు పెద్దలు కలుగజేసుకుని సోదరులారా! మీరిద్దరూ ఆమెను పరిణయమాడండి. ఆరునెలలొకరూ, ఆరునెలలింకొకరూ ఆమెతో కాపరం చేయండి. అంతకంటే మరో మార్గం మాకు తోచడంలేదు—” అన్నారు. వారి సలహా ప్రకారమే వీళ్లిద్దరూ ఆమెను పెళ్లిచేసుకుని సంసారం చేయసాగారు.


కొంతకాలానికి - ఆమె భర్తలలో పెద్దవాడు మరణించాడు. విక్రమారా! ఒక భర్త మరణించాడు కనుక ఆమె వితంతువై ఆ నియమాలు పాటించాలా? లేక భర్త సజీవంగానే ఉన్నాడు కనుక సుమంగళిగానే సుఖజీవితం సాగించాలా? సమాధానం తెలిసీ చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అని హెచ్చరించాడు భేతాళుడు. విక్రమార్కుడు కొంచెం ఆలోచించి -


"భేతాళా! పెద్దవాడినే అనుసరించి ఆమె వైధవ్యం అనుభవించాలి కాని అతనే తన వివాహకాలంలో ఆమె ఐదోతనంలో తమ్ముడికి భాగమూ స్థానమూ యిచ్చి వున్నాడు. చిన్నవాడింకా జీవించే ఉన్నాడు కనుక ఆమె ముత్తయిదువుగా ఉండుటయే ధర్మం" అని చెప్పాడు. భేతాళుడతని తెలివిని మెచ్చుకుని - మాయమైపోయాడు.

No comments:

Post a Comment