స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు?
పూర్వం ఒక రాజుగారి న్యాయస్థానానికి అతి విచిత్రమయిన కయ్యము విచారణకు వచ్చింది. కోశాధికారియింట్లో ఉండే పావురాల జంటలో కుటుంబ కలహం ఏర్పడి ఆ కలహం పెరిగి పెరిగి పెద్దదై - ధర్మముననుసరిస్తాడనే పేరొందిన రాజు వద్దకు వచ్చింది.
ఆడపావురం యిలా చెప్పుకుంది. "ప్రభూ! ప్రపంచంలో పురుషజాతి అతి క్రూరమైనది. రత్న గిరియందుండే శశాంకుడు నీచుడూ దుర్మార్గుడూ. అయినా అతని మీద దయతో క్షమాకారుడు తన కుమార్తె సుశీలనిచ్చి - వివాహం చేశాడు. పతియే దైవముగ భావించుచు కాపురం చేయుచున్న సుశీలను జదరీ, తాగుబోతూ అయిన శశాంకుడు నానాహింసలూ పెట్టేవాడు. కాపురాన్ని అప్పులపాలుచేశాడు.
సుశీల పుట్టింటికి వెళ్లి "మీ అల్లునకు వ్యాపారమందు నష్టమొచ్చింది' అంటూ తండ్రినుంచి డబ్బు తీసుకురాగా... శశాంకుడామె ధనమునంతయూ అపహరించి - వనభోజనం నేపంతో భార్యనొక అడవికి తీసుకెళ్ళి నూతిలోకి తోసేశాడు. కాని సుశీల ఎలాగో బతికి బయటపడి మళ్లీ పుట్టింటికి చేరి మగని దుర్మార్గమును బయటపెట్టక - ఏవో సాకులు చెప్పి మళ్లీ తండ్రినుంచి డబ్బు తీసుకుని వస్తుంటే శశాంకుడామెను - తోవలోనే చంపివేసి ఆ డబ్బును పట్టుకుపోయి తాగుచూ జూదమాడుచుండెను.
మగవారు కుటిలురూ, కుత్సితులూ అనడానికింకేం నిదర్శనం కావాలి?' అని ముగించింది. ఈసారి మగపావురం చెప్పసాగింది.
“అమరావతి నగరమందుండే ఉత్తముని భార్యరూపవతికి క్షయవ్యాధి వచ్చింది. బంధువులూ మిత్రులూ అందరూ - ఆ వ్యాధి నయమయ్యేది కాదనీ అనవసరంగా వైద్యం పేరిట ధనం వ్యర్థం చేయొద్దనీ బోధించినా భార్యని ఎంతో ప్రేమించే ఉత్తముడు తన ధనమునే కాక రక్తమును కూడా భార్యకి ధారపోశాడు. దాంతో రూపవతి వ్యాధినయమయి పరిపూర్ణారోగ్యం పొందింది. కాని -
రక్తమును కోల్పోయిన ఉత్తముడు తగిన ఆహారంలేక నీరసించిపోయి ధనార్జన చేయలేక భార్యనగలనమ్మాలనుకున్నాడు. రూపవతి - భర్త తన కోసం చేసిన త్యాగాన్నయినా తలచకుండా - తన పుట్టింటికి పోయి గ్రామంలో ఉన్న యువకులతో వ్యభిచరించుచూ జారిణికాగా – నిజం తెలిసిన ఆ యువకులు ఆమె ముక్కు చెవులు కోశారు. రూపవతి - తన భర్తే తన ముక్కు చెవులని కోశాడని ప్రచారం చేయగా రాజు ఉత్తముని ఉరితీయించాడు.
భార్యనెంతో ప్రేమించిన ఆ భర్తకు లభించిన ఫలమది. కనుక - ప్రపంచంలో స్త్రీజాతి ఎంత మాత్రమూ మంచిది కాదు.” విక్రమార్కా! వారి మాటలు విన్నావు కదా? స్త్రీ పురుషులలో ఎవరు మంచివాళ్లు? ఎవరు చెడ్డవాళ్లు?” అడిగాడు భేతాళుడు.
స్త్రీలయినా పురుషులయినా మానవజాతే. ఇద్దరికీ మానవవిలువలు సమానమే. ఆ విలువలను నిలబెట్టుకోలేకపోయిన వారు స్త్రీ అయినా పురుషుడయినా చెడ్డవారే. మంచి చెడులకి లింగ భేదముండదు." అన్నాడు. విక్రమార్కుడు. అతని మౌనానికి భంగమవడంతో భేతాళుడు అదృశ్యమైపోయాడు.
No comments:
Post a Comment