పామర పండితులు
పూర్వము హరిహరపురమనే పట్టణమునందు వేదాంతి వరదయ్య, సిద్ధాంతి సిద్ధయ్యయనే యిరువురు భక్తులున్నారు. వారిలో నొకడు వరదయ్య విష్ణుభక్తుడు వీనికి శివభక్తులనిన అమితద్వేషము. రెండోవాడు సిద్ధయ్య శివభక్తుడు ఈతనికి విష్ణుభక్తులనిన అసహ్యము. అందుచే ఎవరికి వారు తమ తమ దైవములనే గొప్పవారిగా ప్రచారముగావించుకొని యితర దైవాల్ని దూషించేవారు.
వారిరువురూ వారి వారి యిష్టదైవముల పట్ల అమితభక్తి కలవారు. సాటిలేని నియమనిష్ఠలతో పూజలు చేసేవారు కలిసి నియమాలు, ఉపవాసదీక్షలు మున్నగు పూజలందుకొనే వారు ఒకరిని మించిన వారింకొకరు, వారిద్దరూ ఎదురు పడితే తమతమ దైవములను గూర్చి వాదించుకునే సమయాల్లో చండప్రచండులై చూచేవారికి భీతిగొల్పుతూ ఉండేవారు. వారిద్దరూ ఒకరి నొకరు చంపవలెనని ప్రయత్నములు సల్పుతూ బ్రాహ్మణ హత్యలు చేసీ ముఠాలు రెండింటిని చేరదీసి వారికి కావలసినంత ధనము నిచ్చి ప్రోత్సహించేవారు. కాని వారి పాపకర్మఫలమున వారిద్దరూ ఆయా ముఠాల చేతుల్లోనే తనువులు చాలించారు. వారిద్దరూ పోయిన పిదప ఆ పట్టణమంతా మతకలహాలు, కక్షలు లేక సుఖముగానుంది.
మరణించిన భక్తులిద్దరూ యమసదనానికేగారు. యమ ధర్మరాజు దారి దుష్కృత్యములను విచారించి "మీరెంత మాత్రము నరకలోకాన ఉండుటకు వీలులేదు. తక్షణమే పొండి" యని వెడలగొట్టాడు. తరువాత వారు వైకుంఠసదనానికేగారు. నారాయణ భటులు గూడా వారిని విచారించి "మీ రెంత మాత్రం యిక్కడుంటానికి వీలులేదు. దూరము పొండి" యని గెంటేశారు. ఏం జెయ్యటాన్కి పాలుబోక ఎక్కడి కెళ్ళాలో దెలియక మదనపడుతుండగా దైవము వారిద్దరిని దయ్యములుగా జేసి గెంటివేసింది. వారిద్దరూ దయ్యాలై ప్రజలను పీడించుచుండగా భూతవైద్యులు వారిని బంధించారు. ఈ విధముగా వారు నానాహింసలకు గురికాబడ్డారు.
"ఓ విక్రమార్క మహారాజా! వారిద్దరూ ప్రజ్ఞా వంతులైయుండి, శక్తిగలవారయ్యున్ను మీదు మిక్కిలి సదాచారభక్తి సంపన్నులైయుండి గూడా ఎందుకు ఈ దుర్గతిని పాల్పడ్డారు. వివరించమని" జెప్పగా విక్రమార్కడిట్లు చెప్పసాగాడు.
"భేతాళా! సహనములేని ప్రజ్ఞ, శక్తి, భక్తి, జ్ఞానసంపన్నులన్నియు ఎంత ఉన్నను నిష్ప్రయోజనమే, వరదయ్య, సిద్ధయ్యలిద్దరు మహాభక్తులే కాని జ్ఞాన శూన్యులు. పరమత ద్వేషం కలవారు. ఎంతటి వారికిని పరమత ద్వేషము, పరులను నిందించుట, కుల ద్వేషములు పనికి రావు. ఇవి సమాజమును భ్రష్టపట్టించున”ని జెప్పగా భేతాళుడు నిజస్థానమునకు పోయెను.
No comments:
Post a Comment