Friday 16 December 2022

భేతాళ కథలు - 17



మార్పు


పూర్వము అమలాపురంలో హేమగుప్తుడనే వైశ్యుడుండేవాడు. అతడొక్కసారి వ్యాపారమునకై దూరదేశమునకు పోయి వచ్చుచుండగా దారిలో నలుగురు మనుషులొక పిల్లవాడిని చంపబోతూంటే చూసి " కారణమేమిటి" అని అడిగాడు.


"ఇతని తండ్రి మాకు వేయివరహాలు బాకీ. అతను చనిపోయాడు. ఆ బాకీ యితను చెల్లించవలసియున్ననూ చెల్లించుట లేదు. అందుకని యితనిని చంపుచున్నాము” అన్నారు వాళ్లు. "ఆ సొమ్మును నేనిచ్చెదను. ఇతనిని వదిలిపెట్టండి" అంటూ వారికి డబ్బిచ్చేసి కుర్రవాడికెవరూలేరంటే - తన వెంట తీసుకొచ్చి ఆశ్రయం కలిగించాడు. ఇలాగ సుబుద్ధి అతని యిల్లు చేరిన కొన్నాళ్లకే ఆ వైశ్యుడికి కొడుకు పుట్టాడు. అతని పేరు సమబుద్ధి.


అంతకు కొన్నేళ్ల ముందు అమలాపురం, పరిసరగ్రామాల మీద ఒక రాక్షసుడు పడి చిక్కినవారందరినీ చూసి తినేస్తూంటే - ఆ గ్రామస్తులందరూ అక్కడ పంచాయితీ జరిపి - రోజూ ఒక గ్రామంనుంచి ఒక మనిషిని పంపేందుకూ, రాక్షసుడు మిగిలినవారి జోలికి రాకుండానూ ఒక ఒడంబడిక(అంగీకారం.. అగ్రిమెంటు) చేసుకున్నారు.


ఆ వేళ రాక్షసుడికి ఆహారంగా మనిషిని పంపవలసిన వంతు హేమగుప్తునికి వచ్చింది. చేయగలిగేదేమీలేక అతను తన కొడుకు సమబుద్ధిని వెళ్లమన్నాడు రాక్షసునికాహారంగా. ఐతే హేమగుప్తునికి తెలియకుండా సమబుద్ధితోపాటు సుబుద్ధికూడా వెళ్లాడు. "మీరు యిద్దరెందుకు వచ్చారు?" అడిగాడు రాక్షసుడు.


"అయ్యా! మేము వరుసకు సోదరులం. నేను వీడి తండ్రికి జన్మించక పోయినా- వీరు నా కొకప్పుడు ప్రాణదానం చేశారు. అంతేకాదు. నన్ను చేరదీసి కుటుంబ సభ్యుడిని చేసుకుని యిన్నాళ్ళూ నన్ను చక్కగా పెంచుతూ పోషిస్తున్నారు. వారి రుణం తీర్చుకుందుకు నాకిది చక్కని అవకాశం. వారి కుటుంబాన్ని నిలపడానికి నా ప్రాణాన్నివ్వడం నాకు ధర్మమూ, విధీకూడా. కనుక తమరు సమబుద్ధిని విడచిపెట్టి నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి” అని వినయంగా ప్రార్థించాడు. అంతలో సమబుద్ధి ముందుకొచ్చి - "అయ్యా! ఏ సుముహూర్తాన సుబుద్ధి మా యింటికి వచ్చెనో మరి, మా తండ్రిగారికన్నియూ శుభములే జరిగినవి. పుత్రోదయం కూడా అయినది. మా తండ్రిగారికితడనిన అమితమయిన ప్రేమ. ఇతడు అన్నగా నేను తమ్ముడిగా ఎంతో అభిమానంతో పెరిగాము. అది అలా వుంచండి. నా బదులు వీనిని మిమ్మల్ని తిననిచ్చినచో మా తండ్రిగారు రక్షించినవానిని - నేను భక్షించినట్లే అగును. అలా జరిగితే నేను మా తండ్రికింత ద్రోహం చేసినట్లే ఔతుంది. అందుచేత తమరటువంటి ప్రమాదమూ పొరపాటూ జరగనివ్వక-నన్నే భక్షించి సుబుద్ధిని వదలివేయుడు" అని కన్నీటితో వేడుకున్నాడు.


ఆ పిల్లల మాటలకు రాక్షసుడి మనసు కరిగిపోయింది. వాళ్ల మీద జాలితో పాటు అతని బుద్ధి కూడా వికసించింది. తన తప్పు తెలిసి వచ్చింది. మనసు మారిపోయింది. "మీలో ఒకరినే కాదు. ఇకపై నేనెవరినీ తినను” అన్నాడు. వాళ్లనింటికి వెళ్లిపొమ్మన్నాడు.


“విక్రమార్కా! ఆ వైశ్యబాలురు సుబుద్ధి, సమబుద్ధులలో ఎవరు గొప్పవారు? సూటిగా అడిగాడు భేతాళుడు. "నిజానికి మనం చెప్పుకోవలసింది - మంచివాడిగా మారిన రాక్షసుడి గురించే. ఎందుకంటే సుబుద్ధి, సమబుద్ధులకు మొదటి నుంచీ సంస్కారము ఉంది, జ్ఞానమూ ఉంది. కాని రాక్షసుడు మంచివాడిగా - మారడమే గొప్ప" అన్నాడు విక్రమార్కుడు. అతను మాటలాడడంతో- భేతాళుడదృశ్యమయి పోయాడు.


No comments:

Post a Comment