అపాత్రదానం
విక్రమార్కా! నీకు పుండరీకుడి కథ చెబుతాను. శ్రద్ధగా విను " అంటూ మొదలు పెట్టాడు భేతాళుడు. విక్రమార్కుడు చెప్పమనీ అనలేదు. భేతాళుడి వద్ద యిలాటి కథలు యిరవయ్యయిదున్నట్లు అంచనా. వాటన్నిటికీ తను జవాబులు చెప్పగలిగితే మంచిదే. లేదా.. తనకి నిజంగా సమాధానం తెలియని చిక్కు ప్రశ్న అతనడిగినా సరే. అప్పుడు తను మౌనంగా ఉండిపోవచ్చు. సమాధానం తెలిసి చెప్పకపోతే కదా బుర్ర వెయ్యి ముక్కలయ్యేది?” తెలియక మౌనంగా ఉండిపోతే బాధవేయదా?
"శ్యామలాపురంలో పుండరీకుడనే యువకుడుండేవాడు. అతను చాలా ధనవంతుడు. విలాస ప్రియుడు. భోగలాలసుడై జీవిస్తూంటే కొందరు దొంగలతని ధనమునంతయు దొంగిలించి అతన్ని చావగొట్టి నదిలో పారేశారు. అతను నదిలో కొట్టుకుపోతూంటే ఒక ముని చూసి బయటకు తీయించి సపర్యలు చేకూర్చి అతని ప్రాణాలు కాపాడాడు. తరువాత అతని కథంతా విన్నాడు. ఆ మునికి అతని మీద దయకలిగింది. తపోదీక్ష ప్రసాదించాలనిపించింది కానీ - 'ప్రస్తుతం యితనికి తపస్సువంటివి తగవు, ఇతని మనసు కామభోగములందే కొట్టుమిట్టాడుతోంది. కొన్నాళ్లిలాగే గడపనీ' ' అని తన తపోబలంతో - దగ్గరలోనే మేడలు, పూలతోటలు, కొలనులు, సౌందర్యవతులు, ధన, ధాన్య వస్తు, వాహన సముదాయాన్ని సృష్టించి పుండరీకుడికి యిచ్చాడు. వాటిని కొద్దికాలం అనుభవించాక - పుండరీకునికి వాటితో తనివి తీరలేదు. గురువుగారి వద్ద నున్న విద్యలన్నింటినీ సంపాదించినచో యింతకంటే ఎక్కువగా ఐశ్వర్య సుఖాలనుభవించవచ్చుకదా అనే దురాశతో తనకా మంత్రాలన్నింటినీ నేర్పమని ముని దగ్గర పట్టుపట్టాడు. అప్పుడు ఆ ముని మెల్లగా యిలా చెప్పాడు. పుండరీకా! కామభోగములనుండి మనసు విముక్తి చెందిన కాని యీ మంత్రములు పనికిరావు. ఈ మంత్రములు నేర్చుకునే తరుణం ముందుంది. సమయం కాని సమయంలో యిలాటి మంత్రాలు నేర్చుకోవడం అత్యంత ప్రమాదకరం” -
కాని పుండరీకుడు ముని హితవును వినక - “వెంటనే నేర్పండి” - అని మొండికెత్తాడు. చివరికా గురువుగారు అతన్ని నిలవరించలేక రహస్యాలయిన మంత్రాలను పుండరీకుడికు ఉపదేశం చేశారు. అంతే - కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గంలో ఏ ఒక్క దుర్గుణాన్నీ జయించని పుండరీకుడు - హృదయం నిర్మలం కాకుండా పఠించడంతో ఆ మంత్రాలలో ఎన్నో పొరపాట్లు దొర్లాయి. మంత్ర పఠనంలోని దోషాలవల్ల అతని చుట్టూ అంతవరకూ ఉన్న సుందరాంగులందరూ దెయ్యాలయి పోయారు. ఆ మేడలూ, ఉద్యానవనాలూ స్మశానాలయి పోయాయి. దెయ్యాలయిన అందగత్తెలతనిని మింగేశాయి. పుండరీకుడు మరణించాడు.
రాజా! నేరం ఎవరిది? ఆ గురువుదా? పుండరీకుడిదా? నిర్ణయించి తెలియచెప్పు” “భేతాళా! పుండరీకుడు చిన్నవాడు. కామలోలుడు అతనికా వయసులో యుక్తాయుక్తాలు తెలియకపోవడం సహజమే. కాని పెద్దవాడు, సర్వమూ తెలిసిన వాడూ అయిన ముని అలాటి అమూల్యమయిన మంత్రాలను అనర్హుడయిన వానికి ఉపదేశించడం తప్పు. దేనినీ అపాత్రదానం చేయకూడదు కదా? కనుక నేరం గురువుదే” సమాధానమిచ్చాడు రాజు. అతను మౌనం వదిలి మాట్లాడడంతో - శవం అదృశ్యమయిపోయింది. -
No comments:
Post a Comment