Tuesday, 27 December 2022

శ్రీ దత్త పురాణము (1)



ఓం శ్రీ గణేశాయనమః

ఓం శ్రీ సరస్వత్యైనమః

ఓం శ్రీ గురుభ్యోనమః


శ్రీదత్త పురాణము (1)


ప్రథమ భాగం


నైమిశారణ్యములో మునులకు దత్త ప్రత్యక్షం


ధ్యానమూలం గురోర్మూర్తి: పూజా మూలం గురో: పదమ్ :

మంత్ర మూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో: కృపా 


గురుభ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | 

గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః


శుక శౌనకాది మునులందరూ కలసి నైమిశారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటంకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమైయున్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులూ ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్ దృష్టిని భ్రూ మధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమ మార్గంలో వుంచి తేజ స్వరూపుడైన నారాయణుని నిష్టతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మనఃశరీరాలను స్తంభింపజేసి శిలా ప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో వున్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళ భరితంతో ముంచెత్తింది. కోటి సూర్యులకాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి. కేవలమైన తేజస్సు. ఆకారం లేని తేజస్సు, కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలగలిపిన మహా మహస్సు, ధ్యానంలో వున్న మునులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతి పుంజం. ఆ తేజస్సు దశదిశలా వ్యాపించింది. మంగళవాయిద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. శౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో "మహానుభావా ! తేజ స్వరూపా! నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచినా నిన్ను దర్శించలేని ఆశక్తులము. అద్భుతమైన ఆ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనస్సులు మాత్రం పరమానందంలో మునిగివున్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించనిది. దయామయా నీ రూపాన్ని దర్శించగల్గి శక్తి మాకు ప్రసాదించు" అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు.


అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది. మహామునులారా! కన్నులు తెరవండి. మునులందరూ కన్నులు తెరిచారు. అదే తేజోస్వరూపం. ఎరుపూ, నలుపూ, తెలుపూ కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి యున్నారు. చతుర్వేదాలను పఠిస్తున్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్ష స్థలంలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతం అయింది. నాలుగు భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు చేతుల్లో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పీతాంబరం వ్రేలాడుతూ వుంది. దాని అంచులకున్న బంగారు కాంతులు ధగధగలాడుతూ స్వామి పాదాలకు ఒక వింతశోభని కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్రకిరీటం, చెవులకు మకరకుండలాలు భుజాలకు మణిమయమాలలు, చేతి వ్రేళ్ళకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి మరొకవైపు శ్రీవత్సలాంఛనం. బంగారుకొండ మీద కూర్చున్నట్లుగా గరుత్మంతుని మీద ఠీవిగా కూర్చుని దర్శనమనుగ్రహించాడు. సనక సనందనాదులు నారద తుంబురులూ స్తుతిగీతాలు ఆలపిస్తున్నారు. జయవిజయులు ఇరువైపులా సేవలు అందించుచున్నారు. విష్వక్సేనాదులు జయజయ ధ్యానాలు పలుకుతున్నారు.

No comments:

Post a Comment