Tuesday 20 December 2022

భేతాళ కథలు - 21



స్నేహం


"తక్షశిల విశ్వవిద్యాలయం చాలా ప్రసిద్ధి చెందింది. దానిలో - వసుదేవుడు, మహాదేవుడు అనే యిద్దరు విద్యార్థులు చాలా కాలంగా ప్రాణస్నేహితులయి మెలగుతుండేవారు. నేర్చుకోదగిన విద్యలు నేర్చుకోవడం పూర్తయింది. ఇళ్లకి వెళ్లిపోవు సమయం వచ్చింది. అప్పుడు వసుదేవుడు "మిత్రమా! మనమిన్నాళ్ళుగా స్నేహంతో మెలగుతూ వస్తున్నాం, కారణాంతరాల వల్ల నువ్వు నా వివాహానికి రాలేక పోయావు. ఇప్పుడేనా ఒకసారి మా వూరు వచ్చి మా యింటి యందొకటి రెండు దినాలయినా గడుపు-” అని మహదేవుడిని కోరాడు. అతను స్నేహితుడ్ని కాదనలేక అతనితో వాళ్ల గ్రామం వెళ్లాడు. “తర్వాత నువ్వు మా వూరు రావాలి" అని కోరి ఊరుచేరిన మర్నాడు వసుదేవ మహదేవులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బజారు వీధిలో నడస్తూంటే మహదేవుడొక అమ్మాయిని చూసి 'మదనతాపంతో మంచం పట్టేశాడు. అది ఎన్ని వైద్యాలకీ తగ్గకపోగా వసుదేవుడు మహదేవుని - “నీ బాధేమిటి?” అని తరచి తరచి అడిగాడు. - మహదేవుడు ప్రాణమిత్రుడికి తన మదన తాపాన్ని వెల్లడించాడు. ఆమె గుర్తులు చెప్పాడు.


వసుదేవుడు రహస్యముగా ఆమె యింటికి వెళ్లి ఆమెను కలుసుకుని - "రుక్మిణీ! నా మిత్రుడికి నీ యందు మోహము కలిగింది. నిన్ను పొందకున్న అతను జీవింపడు. నువ్వతనికేమీ చెప్పకు. నా మాట నిలబెట్టు. నా ప్రాణ మిత్రుడిని కాపాడు. " అని ఆమెను ప్రార్ధించినంత పని చేసి - అమెనొప్పించాడు. రాత్రి సమయంలో దొడ్డితోవన రహస్యంగా మహదేవుణ్నామె వద్దకు పంపాడు.


మహదేవుడు మహదానందంతో ఆమె గదిలో కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నాడు. తన కోరిక నెరవేరుతుందన్న సంతోషంతో ఉన్న అతనికి - హఠాత్తుగా ఒక చిత్రం కనిపించింది. దానిలో - వసుదేవుడు, రుక్మిణీ వివాహ సందర్భంగా తీయించుకున్న చిత్రం.


మహదేవుడికి మతిపోయింది. “అయ్యో ఎంత పొరపాటు చేశాను!' మహదేవుడు తెగ విచారించాడు. “వసుదేవుడు రుక్మిణీ భార్యాభర్తలని ఎరగక ఎంత మహాపాపం చేశాను ” అని దుఃఖిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకుందుకన్నట్లు - మేడమెట్ల ప్రక్కనున్న బావిలో పడిపోయాడు. మహదేవుడు బావిలో కురకడం గమనించిన రుక్మిణి “నాపై ఎంతో నమ్మకంతో నా భర్త అప్పగించిన పని నెరవేర్చలేకపోయాను. వారి  ప్రాణమిత్రుడిని కాపాడలేకపోయాను. వారికి నా మొహం ఎలా చూబెట్టేది? నేను బతికుండడం దేనికి?” అనుకుంటూ ఆమె కూడా ఆ బావిలోకే దుమికి మరణించింది.


చెప్పినట్లు తెల్లవారుఝామున మిత్రుడు తిరిగి రాకపోవడంతో వసుదేవుడు తనే ఆ యింటికి వచ్చాడు. మేడమీద గదిలో రుక్మిణికాని మహదేవుడు కాని కనపడకపోవడంతో వారిని వెదకుతూ... బావిలో పడి ఉండడం గమనించి తాను కూడా ఆ బావిలోకి ఉరికి ప్రాణాలు వదిలాడు. "మహారాజా! ఆ ముగ్గురి చావులకి ఎవరు అసలు కారణం? మిత్రుడి భార్యపై మనసుపడిన మహదేవుడా? నిజం చెప్పకుండా అతన్ని తన భార్య వద్దకంపిన వసుదేవుడా? భర్తకోరినంత మాత్రాన అనుచితమయిన కార్యమునకు సిద్ధపడిన రుక్మిణా?”


“వీరెవరూకారు. అసలు కారణం విధి. అంతా విధి నిర్ణయమే తప్ప మరొకటికాదు” అన్నాడు విక్రమార్కుడు. అతను పెదవి విప్పడంతో శవం అంతార్థానమయిపోయింది.


No comments:

Post a Comment