Sunday 18 December 2022

భేతాళ కథలు - 19



ధర్మం ధర్మమే


ఒకప్పుడు వంగరాజ్యంలో దొంగల బెడద చాలా ఎక్కువగా ఉండేది. ఆ చోరులను పట్టుకోడానికెన్ని విధాల ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరకు రాజుగారే స్వయంగా ఆ దొంగలని పట్టుకుందుకు రంగంలోకి దిగాడు. రాత్రివేళ మారువేషం ధరించి రాజధానిలో తిరుగుతూండేవాడు. ఒకనాడతనికి దొంగల ముఠా కనపించింది. కాని.. తనొక్కడు వారనేకమంది. అంతేకాక - వీరినేకాక దొంగలందరినీ పట్టుకోవాలి కదా? అందుకని- వారిని సమీపించి - "అయ్యలారా! నేనొక దొంగల ముఠాలో ఉండేవాడిని. రాజుగారు నన్ను బంధించి కారాగారంలో ఉంచగా నేనెలాగో తప్పించుకుని వస్తున్నాను. రాజభటులూ నన్ను వెంబడించు చున్నారు. మీరు నాకాశ్రయమిచ్చి కాపాడండి.” అని ప్రార్థించాడు. ఆ దొంగలు మారువేషంలో ఉన్న రాజును దొంగగానే భావించి తమ నివాసానికి తీసుకుపోయారు. రాజు జాగ్రత్తగా ఆ మార్గములను ప్రాంతాన్నీ గమనిస్తూ గుర్తుపెట్టుకుని మర్నాడు వారినుంచి తప్పించుకునివచ్చి - సేనలతో పోయి ఆ దొంగలందరినీ పట్టుకున్నాడు. అంతవరకూ వారు దొంగిలించి దాచుకున్న బంగారం, వెండి ధనము మొదలయిన వానినన్నింటినీ పేదసాదలకు పంచిపెట్టి ఆ దొంగలకు ఉరిశిక్ష విధించాడు.


రాజభటులు ఆ దొంగల నాయకుని ఉరికంబమెక్కించబోతూండగా ఒక పెద్దమనిషి పరుగు పరుగున వచ్చాడు.


"రాజా! నాకు లేకలేక ఒక్క పుత్రిక కలిగింది. ఆమె ఒకనిని వరించింది. అతనిని తప్ప అన్యులను వివాహమాడనని నిశ్చయించుకున్నది. అతన మీరు ఉరి తీయబోతున్నవాడే. మీరాతనిని ఉరితీసినచో 'నా అమ్మాయి తక్షణం ప్రాణత్యాగం చేయును. కనుక అతనిని క్షమించి వదలండి." అని ప్రార్థించాడు. కాని రాజతని ప్రార్థనను వినలేదు. రాజదండన అమలుపరచవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ దొంగని ఉరితీయడమేమిటి, అతన్ని వరించిన కన్య కూడా మరణించింది. వారిరువురి కళేబరాలను ఒకే చితిమీద దహనం చేశారు. విక్రమార్కా! ఆ కన్య మరణించినందుకు పాపం రాజుదా కాదా?" అని అడిగాడు భేతాళుడు. “రాజు తన ధర్మమును చక్కగా పాటించాడు. ఉచితానుచితాలెరుగకుండా దొంగను వరించుట కన్యదే పొరపాటు. ఆమె మరణమునకు రాజు బాధ్యత రవంతయినా లేదు. అతనికేవిధమయిన పాపమూ అంటదు. -" అని చెప్పాడు విక్రమార్కుడు. అతనికి మౌనభంగం కావడంతో శవంతో సహా భేతాళుడదృశ్యమైపోయాడు.


No comments:

Post a Comment