మునీశ్వరులారా! మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలను యజ్ఞాలను నియమనిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామరూపాలు జన్మకర్మలు అడిగారు కదా యోగోపదేశం చేయటానికి సాధన సాగించటానికి తగిన పుణ్యఫలం అందించటానికి నేను అత్రిమునికి పుత్రుడుగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల లోకాలలో సంచరిస్తూ వుంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పటం వెయ్యినోళ్ళు కలిగిన వానికైనా అసాధ్యము. కాని వీనిలో కొన్నింటిని సూతమహర్షి చెప్పగలడు. అతడు వ్యాసమహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతలామలకములు. ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మకర్మలు తెలుసుకోండి. ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్ణఫలాన్ని పొందండి. ముమ్మూర్తులా నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష, పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపులు కండి. మీరంతా ఏకకంఠంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది. ఇది భక్తి ముక్తిదాయకంగా యోగసిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది. భక్తిశ్రద్ధలతో ఇది పశించిన వారికి సకలాభీష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైంది.
శౌనకాది మునులందరూ దివ్యానుభవంలో ఆనంద పారవశ్యంలో మునిగితేలుతున్నారు. అంతలో నైమిశారణ్యంలోని బ్రహ్మచారులు అక్కడకు వచ్చారు. వారంతా సమిధలు, ఫలాలు సేకరించుకోవటానికి అడవికి వెళ్ళి వాటిని తీసికొని అక్కడ దర్శించిన అద్భుత దృశ్యములను మహర్షులకు చెప్పాలన్న ఆతృతతో ఆశ్రమంలోకి పరుగు పరుగున ప్రవేశించారు. ఆనంద సాగరంలో వున్న మునులకు నమస్కరించారు.
గురువర్యులారా! రోజూ చూసే అరణ్యం ఈ రోజు వింతగా మారిపోయింది. ఎక్కడా క్పూరమృగాలు లేవు. పళ్ళుకాయలతో విరగకాచిన చెట్లు, రంగురంగుల పూవులతో లతలు, కలువల్ని, తామరల్ని గట్టు చేరుస్తున్న సరోవరాలు, హంసలు ఆనందంతో కళకళలాడుతున్నాయి. అడవిలో ఎటుచూచినా పురివిప్పిన మయూరముల నాట్యాలు. ఇదివరకటి అడవిలా లేదు నందనవనంగా మారి వుంది. ఈ వింత మీకు చెబుదామని కారణమేమిటో మీరు చెపుతారని పరుగు పరుగున వచ్చాం అన్నారు.
No comments:
Post a Comment