ఎవరు గుణవంతులు ?
“పూర్వం వేదపారాయణుడి కుమార్తె వివేకవతితో బాల్య నుండి కలసి చదువుకున్న అనురాగుడు అను యువకుడు ఒకనాడామెను సమీపించి – "వివేకవతీ! నాకు నీవన్న ఎంతయో ప్రేమ. ఎలాగేనా నువ్వు నా వాంఛ తీర్చాలి" అని ప్రాధేయపడ్డాడు. అందుకామె “అనురాగా! నా తండ్రి నన్ను ఇన్కొకనికిచ్చి వివాహం చేయబోతున్నాడు. వివాహం జరిగిన వెంటనే నా భర్త అనుమతి తీసుకుని ముందుగా నిన్నే ఆనందింపజేస్తాను” అంది.
వివేకవతికి కొద్దిరోజులలోనే వివాహం జరిగింది. శోభనం నిర్ణయించబడింది. శోభనగదిలో తన కోసం ఆత్రంగా నిరీక్షిస్తున్న భర్తపాదాలకు భక్తితో నమస్కరించి- స్వామి విధివశాత్తు నేను ఒక యువకునికి తొలిపొందు నిచ్చెదనని వాగ్దానం చేసితిని. దయచేసి నాకతనిని తృప్తిపరచి వచ్చుటకనుమతి ప్రసాదించాలి అని ప్రార్థించింది. ఆ భర్త ఒక్కసారి ఆలోచనలోపడ్డాడు. అంతగా అవసరమయితే మగవాడనే కనుక తను మరో వివాహం చేసుకొనవచ్చు కదా అనుకుని - "సరే వెళ్ళు” అని అనుమతించాడు. వివేకవతి వేగంగా అనురాగుని వద్దకు వెళ్ళింది. "అనురాగా! ఆనాడు నీకు చేసిన వాగ్దానమును చెల్లించవచ్చితిని-"అంది.
శోభనపు పెళ్లికూతురి దుస్తులలో అలంకరణలో ఉన్న వివేకవతిని చూస్తూ అతను నిశ్చేష్టుడే అయ్యాడు. ఇచ్చిన మాటకోసం ఆమెయిలా రావడం అతనికాశ్చర్యం కలిగింది. ఆమె ఔన్నత్యమూ తననైచ్యమూ అర్థమయ్యాయి. అతనిలో వివేకం మేలుకొంది. ఎంతో పశ్చాత్తాపంతో "అమ్మా నువ్వు నాకనులు తెరిపించావు. నీవంటి స్త్రీని కాని నీ భర్తవంటి పురుషోత్తముడుకాని అతి అరుదు” అంటూ ఆమెకు నమస్కరించి - ఆమెను వెంటబెట్టుకొని శోభనపు పెళ్లికొడుకు వద్దకు వెళ్లాడు.
వివేకవతి- జరిగినదంతా భర్తకు తెలిపింది. అనురాగుడు అతన్ని తన తప్పు క్షమాపణ కోరాడు. వివేకవతి భర్త వారిని సరిగా అర్థం చేసుకున్నాడు. భార్యయందెటువంటి సంశయముకాని భేదభావముకాని లేకుండా ఆమె అనురాగంతో కాపరం చేయసాగాడు. "అంతవరకూ కథచెప్పి అప్పుడు తన ప్రశ్నలను సంధించసాగాడు భేతాళుడు. "రాజా! అనురాగునకిచ్చిన మాట నిలబెట్టుకున్న వివేకవతి. ఆమె వాగ్దానము నిలబెట్టుకొనుటకు ఆమోదము తెలిపిన ఆమె భర్త. సరైన సమయంలో తన తప్పు తెలుసుకొని వివేకవతి వంటి సౌందర్యవతి పొందును త్యాగం చేసుకుంటూ ఆమెను మాతృమూర్తిగా భావించిన అనురాగుడు వీరు ముగ్గురిలో ఎవరు ఎక్కువ గుణవంతులు?
వారు ముగ్గురూ గుణవంతులే. ఏ భార్యా కోరరాని కోరిక కోరినా వివేకవతిని ఆమె వాగ్దానం నిలుపుకొనుటకు ఆంగీకరించడం అతని గుణవిశేషాన్ని సూచిస్తుంది. సర్వాలంకార భూషితయిన తానెన్నడో మనసుపడిన వివేకవతి చేరవచ్చినా- అప్పటి పరిస్థితిని అవగాహాన చేసుకుని ఆమెను తల్లిగా పరిగణించిన అనురాగుడు, వాగ్దానమును నిలబెట్టుకుందుకు ప్రయత్నించిన వివేకవతి- ఎవరికి వారే ఆదర్శప్రాయులు. అని విక్రమార్కుడు చెప్పగానే భేతాళుడు అదృశ్యమయ్యాడు.
No comments:
Post a Comment