ఏమని పిలవాలి?
'తండ్రి-కొడుకు” వరసయ్యే యిద్దరు కాశీకి వెళ్తున్నారు, కాలినడకన వెళ్తున్న వీరికి తమముందు ఎవరో వెళ్లినట్టు రెండు జతల అడుగుల జాడలు కనిపించాయి.
“ఈ పాదముద్రలు నిస్సందేహముగా స్త్రీలవే." అన్నాడు కొడుకు. “వారిలో ఒకరు వయసులో కొంచెం పెద్ద రెండోది చిన్నది” చెప్పాడు తండ్రి. "ఔను. ఒక జత పాదముద్రలు పెద్దవిగా ఉన్నాయి మరి” “ఆ పెద్ద పాదాల పెద్దదాన్ని నేను చేసుకుంటాను - అన్నాడు తండ్రి. “ఆ చిన్న పాదాల చిన్నదాన్ని నేను చేసుకుంటాను” అన్నాడు కొడుకు- తండ్రి ఆమాటెప్పుడంటాడా అని ఎదురు చూస్తున్నట్లు. “సరే. వేగంగా నడు వాళ్లని కలుసుకుందాం. వాళ్ల పాదముద్రలు పడి ఆట్టే సేపవలేదు కనుక వాళ్లు మరీ దూరంపోయి ఉండరు ” ఇద్దరూ గబగబనడవసాగారు. తొందరలోనే వారాస్త్రీలను కలుసుకోగలిగారు. "మీలో పెద్దపాదములు కలదానిని నేనూ, చిన్నపాదములు కలదానిని నా కొడుకూ వివాహం చేసుకుందామని మేము కోరుకున్నాం. మీ కంగీకారమే కదా అడిగాడు తండ్రి. "ఆ" అన్నారు ఆ స్త్రీలు, అప్పుడు బయటపడింది విచిత్రమయిన వాస్తవం. పెద్దపాదాలు కలది కూతురు చిన్న పాదాలు కలది తల్లి. అయినా సరే తాము ముందుగా అనుకున్న మాట తిరగకుండా పెద్దపాదాలు కల చిన్నదాన్ని తండ్రి, చిన్నపాదాలు కల పెద్దదాన్ని కొడుకు వివాహం చేసుకున్నారు.
రాజా! ఆ తండ్రీ కొడుకులకు పుట్టిన పిల్లలిద్దరు ఏ వరుసతో పిలుచుకోవాలి? "అడిగాడు భేతాళుడు. విక్రమార్కుడు నోరు విప్పకుండా శవాన్ని మోసుకు వెళ్లసాగాడు. తండ్రీ కొడుకులు మరొక తల్లీ కూతుళ్లను వివాహం చేసుకోడమన్నదే రాజుకి అసంగతమని తోచిందేమో. అది- జవాబుకి అర్హమయిన ప్రశ్నే కాదనిపించిందో? నీతి బాహ్యంగా ఉందనిపించిందో .. అతను పెదవి విప్పలేదు. అయినా అతనికి ఆపదా సంభవించనూలేదు.
అప్పుడు భేతుళుడిలా అన్నాడు. 'విక్రమార్కా! నేనెంతమంది రాజులనో చూసితిని కాని నీవంటి ధైర్యసాహసములు కలవారినినెవరినీ చూడలేదు. నీవు నా ప్రశ్నలన్నిటికీ ఓపికగా చక్కగా సమాధానాలు చెప్పావు. కనుక నీకక మేలు చేయాలనుకుంటున్నాను, విను. నువ్వు నన్ను ఏసన్యాసి వద్దకు తీసుకెళ్తున్నావో అతడు ఒక శక్తికి పూజలు చేస్తున్నాడు. ఆ క్షుద్రపూజకు - సకలగుణములు కలిగిన క్షత్రియునికాని సమస్త యోగజ్ఞానియగు సన్యాసిని కాని ఎవరు పూజాసమయంలో బలియిస్తారో వానికి నన్ను వశపరుతునని శక్తి వాగ్దానము చేసింది. అందుకంగీకరించి సన్యాసి నిన్ను మోసగించి యిలా తెచ్చి నిన్నా శక్తికి బలియివ్వబోతున్నాడు. అందుకే నన్ను తేవడానికి నిన్ను నియమించాడు. ఏమి జరుగబోతున్నదో తెలుసా? విక్రమార్కుడు మౌనం వదలలేదు. భేతాళుడే మళ్లీ చెప్పసాగాడు. "రాజా! నువ్వు నన్నక్కడికి చేరుస్తావు. అతను నిన్ను దేవిముందు సాష్టాంగ ప్రణామం చేయమంటాడు. ఆ భంగిమలో ఉండగా నిన్ను బలిద్దామని. కాని ... రాజా! నువ్వుప్పుడు నాకొకరిచే మోక్కించుకొనుటయేకాని నేను మరియొకరికి మొక్కుట ఎరుగను, కనుక అది ఎటులో మొక్కిచూపుము అను. అప్పుడు సన్యాసి శక్తిముందు మొక్కుతూ సాగిలపడతాడు. ఆ సన్యాసి సామాన్యుడు కాడు. అఖిలలోక సంపన్నుడు. అందుచేత నువ్వు నీ చేతికత్తితో వాని తలనరికి వేయి. అప్పుడు శక్తి తన కోరికను నీవు చెల్లించావు. కనుక - నీ ధైర్యమునకు మెచ్చుకుని నన్ను నీకు వశం చేస్తుంది" అని చెప్పాడు.
విక్రమార్కుడు భేతాళునితో కూడిన శవాన్ని సన్యాసి ముందుంచాడు. "వేగంగా ఆ కొలనులో స్నానం చేసి పవిత్రుడివయిరా” అని సన్యాసి చెప్పగానే స్నానం చేసి వచ్చాడు. "శక్తికి మొక్కు-" అన్నాడు సన్యాసి.
"ఎలా మొక్కాలో తమరు చేసి చూపించండి" అన్నాడు రాజు. అతివినయంగా. “ఇలా" అంటూ సన్యాసి దేవి ముందు సాష్టాంగ దండప్రణామం చేశాడు. తక్షణం విక్రమార్కుడు చంద్రాయుధమనే తన కత్తితో అతని తల నరికాడు.
శక్తి ప్రత్యక్షమయింది. విక్రమార్కుడి సాహసానికి మెచ్చుకుని భేతాళున్ని అతనికి వశపరచింది.
'రాజా! ఇక నుంచి నేను నీ పరమయ్యాను. నువ్వెప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నేను నీముందు వాలుతాను. నాకు ప్రస్తుతం శలవివ్వు' అన్నాడు. శలవిచ్చి విక్రమార్కుడు ఉజ్జయిని చేరుకున్నాడు.
No comments:
Post a Comment