చక్రాసి గదాధరా! శార్ఞధరా! సకల కారణ కారణా! కారణాతీతా! అవక్ర పరాక్రమా! పురుషోత్తమా! సృష్టి, స్థితి, లయ, కారకా! జగత్క్రీడా వినోదీ! త్రిమూర్తి స్వరూపా! నమోనమః చిదగ్ని స్వరూపా! వేదాంతులు నిన్ను పరబ్రహ్మననీ సాంఖ్యవిధులు నిన్ను పురుషోత్తముడవనీ, యోగులు పరమాత్మ అనీ, మీమాంసకులు ధర్మమనీ, విజ్ఞానులు శూన్యమని, చార్వకులు పంచభూతాత్మకమని అంటూ స్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపడవంటున్నాయి. మళ్ళీ కాదు అంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి. వాచామగోచరా! తేజోమయా! నమోనమః ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము, అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి. సకల ప్రాణికోటిలోని జీవశక్తివి. సృష్టిలో నీవుకానిది, నీవు లేనిది ఏదిలేదు. సకలవ్యాపకా! ఆది దేవా! దివ్య పీతాంబరం ధరించావు. సువర్ణకాంతులు జిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యుల కాంతిలో వెలిగిపోతున్నావు నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమౌతాయి. కర్మఫలప్రదాతా! కర్మసాక్షి! అరిషడ్ వర్గాలను జయించి సమాహితచిత్తులై నీ పురాణగాధను విన్నవారు సంసార సముద్రాన్ని అవలీలగా దాటుతారు. ఆనంద స్వరూపా! అమృతమయా! నమోనమః
శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడవై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టిని చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు యోగీశ్వరులూ నిన్ను స్తుతిస్తుంటారు. సృష్టి విధాతా! నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపజేసే సత్వగుణ ప్రధానా! స్థితి కారణా! శ్రీమన్నారాయణా! ముముక్షువులందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యువు అభ్యర్థిస్తే సాక్షాత్తూ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయామయుడవు. తమోగుణ ప్రధానుడవై ప్రళయవేళ సకల సృష్టిని ఉపసంహారించే మహాకాల స్వరూపా! భయంకరా! అభయంకరా! శంకరా! నమోనమః నైమిశారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వరులారా నా దర్శనముతో మీరు కృతార్ధులయ్యారు. ఏమికావాలో కోరుకోండి అన్నాడు. సృష్టి, స్థితి, లయ కారకా ధన్యులమయ్యాము. నీ విరాడ్రూపాన్ని దర్శింపజేసావు. ఇంతకాన్నా నీ నుండి మేము కోరుకోవలసింది ఏముంది. అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాము. ఇన్ని ఆకారాలలో మాకు కనిపించావు వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మల వృత్తాంతం ఏమిటి? నువ్వు త్రిమూర్తులకు అతీతుడవని పరాక్రముడవనీ విన్నాము ఇది నిజమా ? కాదా ? మా అజ్ఞానాన్ని మన్నించి మాసంశయాలు తొలగించు. నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు. అన్యయ ఆనందాన్ని అందించు అన్నారు.
No comments:
Post a Comment