Wednesday 7 December 2022

భేతాళ కథలు - 9



ఆత్మహత్యకు అసలు కారణం 


భూలోకంలోని నగర రాజ్యాలన్నిటికీ కిరీటంలాటిది విజయనగరమనే పురం. దాని రాజు వంశకేతుడు. అతను నిత్యవ్రత అనే రాకుమారిని వివాహమాడి - ఆమెపై వలపు వీడలేక రాత్రింబవళ్ళు అంతఃపురంలోనే గడుపుతూ రాచకార్యములను పట్టించుకోవడం మానేశాడు.

అతని మంత్రి తీర్థదర్శి. పాలనా వ్యవహారాలు చూసేవాడు. దాంతో "ఈ మంత్రి ఎప్పుడో ఒకనాడు రాజునణచి రాజ్యము నపహరించును" అని పుకార్లు పుట్టసాగాయి. అవి మంత్రికి తెలిసాయి.


“లోకులు కాకులవంటివారు. వారికి నా మనసులోని ఉద్దేశం తెలియదు. నిజం తెలియకే యిలాటి నిందలు వేస్తున్నారు. లోకనింద భరించడం మహాకష్టం. ఇలా అపవాదుపడ్డాక రాజ్యం విడిచిపోవడమే మంచిది.” అనుకున్నాడు - తీర్థదర్శి. ఈ విషయం రాజుకి తెలిపి మరో మంత్రికి రాజ్యాధికారం యిచ్చాడు.


దేశత్యాగం చేసిన తీర్థదర్శి అనేక దేశాలు తిరిగి తిరిగి చివరకి సముద్రతీరంలో ఉన్న ఒక నగరాన్ని చేరుకుని అక్కడి వర్తకులలో ఒకరితో స్నేహం చేసి నిరంతరమూ అతనిని విడవకుండా ఉంటూండేవాడు.. ఒక రోజు - ఆ వర్తకుడు తన స్నేహితునితో - "నేనిప్పుడే బయలుదేరి ఓడపై ద్వీపానికి వెళ్తున్నాను. నేను పని చూసుకుని వచ్చేవరకూ నువ్విక్కడ నా బదులుగా అన్ని పనులూ చూడు" - అన్నాడు.


“నిన్ను విడచి నేనొక్కనిముషయినా ఉండలేను. నేనూ నీతోవస్తాను' ' అన్నాడు తీర్థదర్శి. అలాగ వారిద్దరూ ఓడమీద వెళ్తూ - ఒక ద్వీపంలో అద్భుత సౌందర్యవతినొకామెను చూశారు. ఆమెను చూసి అమితాశ్చర్యానికి లోనయిన తీర్థదర్శి - “ఈమె ఎవరు? అని అడిగాడు. వర్తకుడు - "ఈ కన్యారత్నమెవరో నాకు తెలియదు. కాని నేను ఓడమీద వచ్చిపప్పుడల్లా యీమెనిక్కడ తప్పకుండా చూస్తుంటాను" అని చెప్పాడు.


తరువాత తీర్థదర్శి కొంతకాలానికి స్వదేశానికి తిరిగి వెళ్లిపోయాడు. తన మునుపటి రాజగు వంశకేతుడిని సందర్శించాడు. ఆ రాజు తీర్ధదర్శిని చూసి ఎంతో ఆనందించి కౌగలించుకొని, గౌరవించి కుశల ప్రశ్నలడిగి - “నన్నెందుకు విడచివెళ్లావు?” అని అడిగాడు.


“రాజా! నువ్వు స్త్రీలోలుడిపై అంతఃపురము విడచిరాక రాచకార్యములు నిర్వహింపకపోవుటచే నేనీ రాజ్యమును హరింతునని లోకోపవాదములు పుట్టాయి. ఆ నిందలు భరించలేకనే దేశం విడచి వెళ్లాను - " అని చెప్పాడు తీర్థదర్శి. రాజు విశేషాలేమిటని అడిగాడు. "ఒకచోట నేనొక వర్తకునితో స్నేహం చేసి.. అతనితో మరోద్వీపం ఓడమీద వెళ్లాను. అక్కడ ఒక చోట కాళికాలయముంది. దాని ముందున్న చెట్టు నీడలో ఒక కన్యారత్నం ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఎంత అందగత్తో నేను చెప్పలేను. నేనెన్నడూ అంత చక్కని స్త్రీని చూడలేదు.." అని తీర్థదర్శి చెప్పేసరికి వంశకేతుడు చాలా ఆశ్చర్యపోయి "తీర్థదర్శీ! నేనామెను చూడాలి! నా బదులు నవిక్కడుండు. త్వరలోనే వచ్చేస్తానులే” అంటూ అక్కడికి వెళ్లడానికవసరమయిన వివరాలు తెలుసుకుని - వర్తకునితో స్నేహంచేసి అతనా ద్వీపం వెళ్లేటప్పుడు వెంటవెళ్లి - మంత్రి చెప్పిన చోట ఆ కన్యకను చూసి ఆమె పట్ల మోహమూ, ప్రేమలో పడి కాళికాలయంలో పూజచేసి - - ప్రసాదం తీసుకుని ఆమె వద్దకు వచ్చాడు.


ఆమె అతన్ని చూసి దాక్కోబోగా ఆమె కొంగు పట్టుకుని వదలకుండా ఎన్నో విధాల ఆమెను ప్రార్ధించాడు. ప్రాధేయపడ్డాడు. అతను రాజని తెలిసి ఆమె అంగీకరించింది. వాళ్లిద్దరూ సుఖాలలో ఓలలాడారు. ఒకనాడు - వ్రతం నిమిత్తమామె నీటిలో మునగగా ఒక రాక్షసుడామెను మింగేశాడు. రాజు ఆ రాక్షసుడి పొట్టను తన కత్తితో చీల్చి తన భార్యను బయటకు తెచ్చాడు. కొన్నాళ్లు గడిచాక ఆమెను వెంటబెట్టుకుని తన రాజ్యానికి చేరుకున్న రాజు మునపటికంటె మరింతగా కాంతాలోలుడయి అంతఃపురందాటి బయటకు రావడం మానేశాడు.


అది చూసి మంత్రి విషం తాగి బలవంతంగా మరణించాడు? రాజు తిరిగి వచ్చాడనా? లేక తాను చూచినకాంత తనకి కాకుండా రాజుకి దక్కిందనా?” అడిగాడు భేతాళుడు. అందుకు - "భేతాళా! రాజు యిదివరకే స్త్రీలోలుడు. అది తెలిసి కూడా తానా స్త్రీ గురించి అతనికి చెప్పినందువల్లనే రాజు రాచకార్యములు మానేశాడు. ఆ అపవాదు తనమీదే పడుతుందని భయపడి మాత్రమే ఆ మంత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తప్ప మరే కారణమూకాదు-” అని జవాబిచ్చాడు విక్రమార్కుడు. అతని మౌనానికి భంగమవడంతో భేతాళుడు మాయమై యథాస్థానం చేరుకున్నాడు.


No comments:

Post a Comment