ఆ పాపం ఎవరిది?
పాటలీపుత్రంలో నారాయణ దీక్షితుడనే పేరుకల బ్రాహ్మణునికి చాలా అందమయిన భార్య ఉండేది. ఆమె పేరు సుందరి. (ఈ పేరు కల్పితం) ఒకనాటి వెన్నెలరాత్రి నారాయణ దీక్షితుడు భార్యతో సౌదాగ్రమున మేడ మీద ఆరుబయట వెన్నెలపలలో ఆకాశం కనిపించేలా... నిద్రపోయాడు.
ఆ సమయంలో ఆకాశవీధిలో విహరిస్తున్న గంధర్వుడొకడా బ్రాహ్మణు స్త్రీ సౌందర్యానికి మురిసి - తన మంత్రశక్తితో ఆమెను అపహరించుకుపోయాడు.
ఉదయం నిద్రలేచిన నారాయణ దీక్షితులుకి భార్య కనపడలేదు.
ఆమెకోసం ఎన్నిచోట్ల వెదకినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆమె కనిపించలేదు. తిరిగి తిరిగి అతనొక అడవిని చేరుకోగా అక్కడొక మహాముని కనిపించాడు. దీక్షితులాయనికి ప్రణామం చేసి తనదీనావస్ధను కన్నీటితో విన్నవించుకున్నాడు.
ఆ జడధారి మనసు కరిగింది. తన దివ్యదృష్టితో సుందరి ఉన్న చోటుని కనుక్కున్నాడు. "ఆ గంధర్వుడి మదం అణచి నీ భార్యని చెరవిడిపించి తీసుకువచ్చే ప్రయత్నం మొదలు పెడుతున్నాను” అంటూ ఆ కార్యక్రమంలో దిగాడు.
ఆ గంధర్వుడు కూడా తన దివ్య దృష్టితో భూలోకంవేపు చూశాడు. సుందరి భర్తయిన దీక్షితులు తపస్వి సహాయం పొందాడని తెలుసుకుని - “ముందు నేనే అతన్ని చంపివేస్తే మంచిది కదా..” అనుకుని పాముగా మారి ఆ ముని ఆశ్రమప్రాంతంలో పొంచి ఉన్నాడు.
ఒకనాడు వినువీధిలో ఎగురుతున్న గద్ద ఆ పాముని చూసింది. - పాము కంటపడడమేమిటి, మెరుపు వేగంతో దానిని కాళ్లతో చిక్కించుకుని ఎగిరి ఒక చెట్టుకొమ్మ మీద ఉంచి నానా హింసలూ పెట్టసాగింది. అదే చెట్టుకింద తాగవలసిన పాలుఉన్న గిన్నెను పట్టుకుని పరధ్యానంగా కూర్చున్న దీక్షితులుకి తన తలపైన చెట్టుకొమ్మ మీద జరుగుతున్న అలజడి తెలియడమేలేదు. అతని ఆలోచనలన్నీ భార్యమీద ఉన్నాయి మరి.
ఆ పాముని గద్ద జయించేసింది. తనకి ప్రాణాపాయం తప్పదని తేల్చుకున్న పాము విషం కక్కేసింది. నురుగులాటి ఆ విషం నారాయణ దీక్షితుల చేతిలో ఉన్న గిన్నెలోని పాలలోపడింది. ఐతే దీక్షితులు భార్యతలపులలో ఉండి - అది కూడా గమనించలేదు. చెట్టుకొమ్మ మీద పాముని చంపి తినేసింది గద్ద. నారాయణ దీక్షితులు గిన్నెలోని పాలను తాగాడు. అంతే మరుక్షణం మరణించాడు ఆ పాలలో కాలకూట విషప్రభావానికి". అంతవరకూ చెప్పి ప్రశ్నలు సంధించాడు భేతాళుడు. "మహారాజా! నారాయణ దీక్షితులు బ్రాహ్మణుడు. అతనిది సహజమరణం కాదు. ఒక విధంగా హత్యే. కనుక అతన్ని చంపిన వారికి బ్రహ్మహత్యాపాతకం అంటక తప్పదు. జాగ్రత్తగా నిర్ణయించి చెప్పు. ఆ బ్రహ్మహత్యాపాతకం ఎవరిది? పాముదా? గద్దదా?” ఆ ప్రశ్నలకు విక్రమార్కుడు. నిమిత్తమాత్రమయిన పాత్రే యీ సంఘటనలో, గంధర్వుడు మొదటినుంచీ అపరాధే. పరస్త్రీని మోహించడం.. ఆమెను అపహరించడం, చెరపట్టడం, ఆమె భర్తను చంపాలని ప్రయత్నించడం... అన్నీ నేరాలే. అతన్ని చంపడానికే గంధర్వుడు పాముగా మారాడు కదా. చివరికి నారాయణ దీక్షితుల మరణానికి కారణం కూడా ఆ పామువిషమే. కనుక నిస్సందేహంగా ఆ బ్రహ్మహత్యాపాతకం పామురూపం దాల్చిన గంధర్వుడిదే" అని వక్కాణించాడు. ఆ విధంగా విక్రమార్కుడి మౌనం చెదరిపోవడంతో శవం మాయమైంది.
No comments:
Post a Comment