Tuesday, 6 December 2022

భేతాళ కథలు - 8



కార్పాటకుడంతకు ముందు మోహించిన నాగకన్య నిజంగానే అత్యద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది. మిగిలిన వారి మధ్య ఆమె చుక్కల్లో చంద్రుడిలాగే ఉంది.


ఆమె రాజును చూసినదే తడవుగా- అతని మీద మోహం చెంది అతని ముందుకు వచ్చి " రా రాజా! నీకేది కావాలంటే అది యివ్వగలను. దయయుంచి నా కోరిక తీర్చు. నీపైమోహంతో నేను తాళలేకపోతున్నాను' అంటూ వేడుకుంది. ఆమె మాటలకు - రాజు -" ఓ సుందరీ! ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు. నా కంటే అన్నివిధాలా గొప్పవాడు. ముందు అతని కోరిక తీర్చి సుఖాల్లో తేల్చు” అన్నాడు కార్పాటకుణ్ని చూపుతూ. రాజే అలా అన్నాక చేయగలిగిందేమీ కనిపించక నాగకన్య కార్పాటకుణ్ని అంగీకరించింది. రాజు వారిద్దరినీ ఒక చోట చేర్చి - "కార్పాటకా! ఆవేళ.. నేను అరణ్యంలో అతిదాహంతో బాధపడుతుండగా నువ్వు నాకిచ్చిన రెండు ఉసిరిపళ్లలోనూ ఒకదానికి యీ నాగకన్యను నీకు జతకూర్చుటతో సరిపోయినది. ఇంకొక పండుకు మాత్రమే నేను రుణపడి ఉన్నాను." అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటిగుంటలో తాను మునిగి తన నగరమున తేలాడు. కార్పాటకుడు నాగలోకంలో సౌందర్యవతితో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు.


రాజా వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారము గొప్పదో నిర్ణయించి చెప్పు. సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ” అంటూ హెచ్చరించాడు. భేతాళుడు. విక్రమార్కుడికిదేమీ అంత జటిలమయిన ప్రశ్నలా అనిపించనట్లుంది. “భేతాళా! శకటశృంగుడు రాజు. కార్పాటకుడు అతని వద్ద సేవకుడు. సేవకుడు స్వామిభక్తిని ప్రదర్శించడం అతని విధే తప్ప అదనపు గొప్పతనమేమీ కాదు. కనుక - అరణ్యములో దాహముతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసిరిపండ్లనిచ్చుటలో - విద్యుక్త ధర్మమే గోచరిస్తుంది. కాని రాజు భృత్యుడు చేసిన మేలుని మరవకపోవడమూ, ఆ మేలుని ఋణంగా భావించి, ప్రత్యుపకారం చేసి - తీర్చుకోవడమూ అతని చిత్తశుద్ధికి, విశాల హృదయాన్ని, సమాన భావాన్నీ తెలుపుతాయి. అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారంకంటే, శకటశృంగమహారాజు చేసిన ప్రత్యుపకారమే శ్లాఘించతగినది” అని చెప్పాడు.


“నిజమే” అంగీకరించాడు భేతాళుడు. 


విక్రమార్కుని మౌనానికి భంగం కలగడంతో - అతని తలమీదనున్న శవం మళ్లీ వెళ్లి మర్రి చెట్టుకు వేలాడసాగింది.


తప్పెవరిది?


మంత్రోపదేశం పొందిన నలుగురు అమాయకపు విప్రసోదరులు తమ మంత్రాలెలా పనిచేస్తాయో పరీక్షించాలనుకున్నారు. వాళ్లు నడుస్తున్న అడవిదారి పక్క ఒక ఎముక కనిపించింది. నాలుగోవాడు దానిని ముందుంచుకుని మంత్రం జపించేసరికి ఆ ఎముక తాలూకు జంతువు యొక్క అస్తిపంజరం ఏర్పడింది. మూడోవాడు తన మంత్రం పఠించేసరికి ఆ అస్తిపంజరానికి మాంసం, రక్తం, పేగులు మొదలయినవి అమిరాయి. రెండోవాడు తను నేర్చుకున్న మంత్రం ఉచ్చరించేసరికి - ఆ ఆకారానికి చర్మమూ, రోమాలూ (వెంట్రుకలు) గోళ్లూ ఏర్పడ్డాయి. అప్పుడేనా- అది పెద్దపులి అని ఆగకుండా పెద్దవాడు తను నేర్చిన మంత్రం చదివేశాడు. తొందరగానూ అమాయకంగానూ. దాంతో ఆ ఆకారానికి ప్రాణమూ చైతన్యమూ వచ్చేశాయి. ఆ పెద్దపులి-ఆకలిమీదుండి నలుగురన్నదమ్ములనీ తినేసింది. "రాజా! తప్పెవరిది? పాపమెవరిది?" అని అడిగాడు భేతాళుడు. "తప్పు కాని, పాపంకాని ఆనలుగురిలోనూ ఎవరిదీ కాదు ఎందుకంటే- నలుగురికి నలుగురూ అమాయకులు. వారిలో ఏఒక్కడికీ యితరులను చంపాలనే దుష్ట తలంపు లేనేలేదు. చెప్పాడు విక్రమార్కుడు. అతని మౌనం చెడడంతో భేతాళుడు శవంతో పాటే మాయమయ్యాడు.


No comments:

Post a Comment