"భర్త... సోదరుడు.. లేని జీవితం నాకెందుకు?” అనుకుంటూ కాళికాదేవి విగ్రహంముందే ఉరిపోసుకుని చనిపోబోయింది. అప్పుడు - కాళికాదేవి ప్రత్యక్షమై - “ఓ యువతీ! నీ పతి భక్తికి, సోదరప్రేమకీ ఎంతో సంతోషం కలిగింది. నీలాటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు. ఎందుకు చనిపోతావు? నీ ఆప్తుల శిరస్సులను రెండింటినీ మొండెము (తలలేని శరీరభాగం)లకు కలుపుము. వారు తక్షణం బతుకుతారు” అంది. ఆమెవైపు దయగా చూస్తునే అదృశ్యమయింది.
అనూహ్యమూ, అత్యంత ఆనందదాయకమూ అయిన దేవి వరానికి ఆశ్చర్యపోతూనూ తన భర్తా, సోదరుడూ మళ్లీ జీవంపొందుతారన్న విశేష సంతోషంలోనూ, తొట్రుపాటు పడిపోతూ ఆమె భర్త శిరస్సును సోదరుని మొండానికీ, సోదరుని శిరస్సును భర్త మొండానికీ కలిపింది. అపరిమితమయిన అనందంలో కూడా కంగారు సహజమేకదా? వారిద్దరూ ప్రాణమొచ్చి లేచి కూర్చున్నారు.
ఆమె వారిద్దరినీ చూసింది. తన పొరపాటు తెలిసి వచ్చింది. తాను చేసిన తెలివితక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది. వీరిద్దరిలో ఎవరు తనభర్త? సోదరుడెవరు? తేల్చుకోలేక తెల్లమొహం వేసి ఉండిపోయింది. ఆమెకేమీ తోచడంలేదు.
రాజా! వారిద్దరిలోనూ ఆమె భర్త ఎవరు? ఆమెకు సోదరుడు కాదగిన వాడెవరు? సకారణంగా సమాధానం చెప్పు?” అన్నాడు భేతాళుడు.
సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు. “సర్వేంద్రియాణం నయనం ప్రధానమని, సర్వేంద్రియాణం శిరః ప్రధానం అనీ పెద్దలు చెప్పిన న్యాయమూ ధర్మము. నయనమూ, బుద్ధీ ఉండేవీ శిరస్సులోనే కనక మనిషి గుర్తింపు అతని శిరఃభాగం బట్టే జరగడం సముచితం. కనుక పతి శిరస్సు కలవాడామెకు భర్త. రెండవ మగవాడామె సోదరుడు చెప్పాడు విక్రమాదిత్యుడు.
భేతాళుడతని పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు. కాని విక్రమాదిత్యుడి మౌనభంగమయింది. కనుక - రాజుతల పైనుండి శవమూ, దాని యందలి భేతాళుడూ మళ్లీ వెళ్లి చెట్టుకు వేలాడ సాగారు.
No comments:
Post a Comment