Wednesday 14 December 2022

భేతాళ కథలు - 15



అసలు తండ్రి ఎవరు?


జయంతీ నగరంలో తిలోత్తమ అను పేరుకల స్త్రీ ఉండేది. ఆమెకు బాల్యమందే వివాహం జరిగింది. (పూర్వకాలంలో చిన్నప్పుడే పెళ్లి చేసేసేవారు ఆడపిల్లలకి). కాని... భర్తవలన ఎటువంటి సంసారసుఖమూ అనుభవించ కుండానే ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది. (అంటే- భర్తచనిపోయాడని. బాల్య వివాహాలవలన కలిగే అనేక నష్టాలలో యిదొకటి) వితంతువుకు అన్నీ అంక్షలే' అలా మొదలుపెట్టాడు భేతాళకథని.


విక్రమార్కుడు తలమీదున్న శవాన్ని గట్టిగా పట్టుకుని వినసాగాడు. "వైధవ్యమంటే వచ్చింది కాని ఆమెకి వృద్ధాప్యం రాలేదు కదా? యౌవనంలో ఉంది. అందగత్తె. కోరికలు ఊరికే పోవు మరి. అందుచేత తిలోత్తమ విధవయినా ఒక మగవానికి మనసిచ్చి అతనితో రహస్యంగా సుఖ భోగాలనుభవిస్తూండేది. ప్రకృతికి - స్త్రీ అనే తప్ప ఆమె విధవా (భర్తలేనిదా) సధవా (భర్తకలదా) అనే తారతమ్యం ఉండదు కనుక ఆమె గర్భవతయింది. భర్తలేని స్త్రీ గర్భవతయితే ఆక్షేపణ కనుక తన రహస్యం బయటకు పొక్కకుండా ఆమె ఎక్కడికోపోయి.. బిడ్డ కలిగాక తనవూరికి తిరిగివస్తూ - మధ్యతోవలో ఆ మగబిడ్డను వదిలేసి వచ్చింది.


ఆ బిడ్డ ఒక శ్రీమంతుడి కంటపడ్డాడు. అతనికి సంతానంలేదు. అందుచేత ఆ మగపిల్లవాడిని తన యింటికి తీసుకుపోయి - దత్తత చేసుకుని.. ఆ అబ్బాయిని పెంచి పెద్దచేసి తన ఆస్తులన్నిటినీ యిచ్చాడు. ఆ కురవాడికతను పెంపుడు తండ్రనే తెలియదు. కొంతకాలానికి అతను మరణించాడు. కొడుకు- తండ్రికి చేయవలసిన అపరకర్మలు (చనిపోయిన వారికి చేసే కర్మలు) చేస్తూ... పిండిప్రదానాలూ తర్పణాలు (ఆహారమూ, నీరూ వదులుతుంటే పితృలోకం (చనిపోయిన పెద్దలు పితృలోకంలో - ఉంటారని నమ్మకం) నుంచి అతని ముందు మూడు చేతులు చాచబడ్డాయి. మొదటిచేయి - తిలోత్తమను వివాహం చేసుకున్న వాడిది. రెండవది - తిలోత్తమకు గర్భం ప్రసాదించిన రహస్య ప్రియుడిది. (అతనూ చనిపోయాడదివరకే). మూడో చెయ్యి అతన్ని దత్తత చేసుకుని పెంచి పెద్దవానిని చేసి ఆస్తిపాస్తులనిచ్చిన పెంపుడు తండ్రిది.


రాజా! ఇప్పుడా కుమారుడు ఆ ముగ్గురి చేతులలోనూ ఎవరి చేతిలో పిండం ఉంచాలో, తర్పణం వదలాలో చెప్పు" అన్నాడు భేతాళుడు. ఒక్క నిముషమయినా ఆలోచించలేదు విక్రమార్కుడు. 'పిండప్రదానాలకు సంబంధించినవి కనుక యీ సమస్యను హిందూధర్మ శాస్త్రాలననుసరించి పరిష్కరించడమే యుక్తం, తిలోత్తమ విధవ అయినదే తప్ప భర్తనుండి విడాకులు పొందలేదు. కనుక ఆమెను పెళ్లి చేసుకున్నవాడే భర్త. ఆమె రహస్యంగా ప్రియుడితో సంబంధం ఏర్పరచుకుందే తప్ప అతన్ని వివాహం చేసుకోలేదు. కనుక ఆ పిల్లవాడి జన్మకు కారకుడయినా అతనా పిల్లవాడికి తండ్రి కాజాలడు. వివాహమాడిన భర్తదే సంతానమౌతుంది. ఐతే - దత్తతవలన కన్నతండ్రికి పుత్రుని వలన పొందే ఉత్తర క్రియాధికారాలు పోతాయి. అతను వాటిని వదులుకునే దత్తత యివ్వాలి. దత్తత తీసుకున్న తండ్రికే పుత్రుడినుంచి ఉత్తర క్రియలకు అందుకునే అధికారం సంక్రమిస్తూంది. కనక అతని దత్తత తండ్రిచేతియందే పిండప్రదానమూ, తర్పణమూ చేయడం సముచితమూ, ధర్మసమ్మతమూ. " అని తీర్మానించాడు.


విక్రమాదిత్యుడు. "సెహభాష్" అంటూనే అంతర్ధానమయ్యాడు శవమూ, దానిలోని భేతాళుడూ. విక్రమాదిత్యుడికి మళ్లీ మౌనం భగ్నమయింది.


No comments:

Post a Comment