Wednesday, 28 December 2022

శ్రీదత్త పురాణము (2)



మహామునులందరూ ఆనందపరవశులై చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నీల మేఘశ్యాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు. వెండికొండమీద నంది వాహనాన్ని అధిష్టించి పరమశివుడుగా మారిపోయాడు. శిరస్సున చంద్రరేఖ. జటాజూటం నుండి దుముకుతున్న గంగమ్మ, శరీరంనిండా వీభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒకచేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఢమరువు, మరొక చేతిలో కమండలం, మరొక చేతిలో జపమాల, కటి భాగాన పులితోలు, నాగజందెం నాగహారములు శరీరం నిండా రుద్రాక్షలను నాగకుండలాలు నాగమంజీరాలు, సర్వ భూషిత సర్వాంగుడు, సందేశ, భృంగీశ, గణేషులూ, వీరభద్ర, షణ్ముఖులు, మాతృగణాలు ప్రమథగణాలు అందరూ పరివేష్టించి యుండగా దర్శనమిచ్చాడు.


ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడుగా మారిపోయింది. తెల్లకమలంపై ఎర్రని రంగులో సృష్టికర్త. నాలుగు ముఖాలు, నాలుగు వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చుని ఉపనిషత్ వాక్యాలను వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణానాదం వినిపిస్తోంది. దివ్యమాలలను ధరించి అర్థ నిమాలిత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మదర్శనమిచ్చాడు.


శౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతి పుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. మూడు రంగులు మూడు మూర్తులూ కలగలిసి కనిపిస్తున్నాయి. ఆరు చేతులు దర్శనమిచ్చాయి. శంఖము, చక్రము, త్రిశూలం, ఢమరువు, మాల, కమండలము చేతులలో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు. సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు, మను, వసు, రుద్రులూ నక్షత్రగ్రహాది దేవతలు కిన్నర కింపురుష సిద్ధ సాధ్య గరుడోరగ దివ్యజాతులూ ఆ త్రిమూర్తి స్వరూపుడ్ని పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు. సప్తసముద్రాలు సకల నదీనదాలు పర్వతాలు సకల సృష్టీ సకలజీవరాసులూ ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి.  


శౌనకాది మునులందరూ ఆశ్చర్య, ఆనందాల నుండి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ "మహానుభావా, త్రిమూర్తి స్వరూపా, మా జన్మలు ధన్యమయ్యాయి. చరితార్థులమయ్యాము. మా జపములు తపస్సు నేటికి ఫలించింది. మహా మహా యోగీశ్వరులకు కూడా లభించని దివ్యదర్శనాన్ని అనుగ్రహించావు. కరుణా స్వరూపా! ధన్యులమయ్యాము. దేవాధిదేవా! భక్తితో మేము చేసే షోడశోపచారములు స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తలఊపాడు. మునులందరూ స్వామిని పూజించి సేవించి ఇలా స్తుతించారు.


No comments:

Post a Comment