కలిలో జ్ఞానోపదేశం బాగా జరగాలి కనుక సన్న్యాసిగా అవతరించాలి. కలిలో గృహస్థుదుపదేశిస్తే జనాలు శంకిస్తూ ఉంటారు. ఆచరించకుండా ఏదో ఉపదేశిస్తున్నాడులే అనే చులకనభావం కల్గుతుంది. ఇంద్రియాలను జయించే గృహస్థులరుదు. ఇక కలిలో వానప్రస్థం నిషేధింపబడింది కూడా. కలిలో గృహస్థాశ్రమం నుండే సన్న్యాసం.
కనుక నివృత్తి మార్గంలో ఉన్నవారికే ఉపదేశానికి అర్హత. ప్రవృత్తి మార్గంలో కూరుకుపోయిన వారు, నివృత్తి మార్గాన్ని ఉపదేశించడమా?
రాత్రి కాలంలో చిన్న దీపం వెలిగిస్తే చాలనే కాలం, పూర్వం ఉండేది. కాని నేడు రాత్రి, పగలూ అనే తేడా లేకుండా దీపం నిరంతరం వెలుగుతూ ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
శంకరులు జీవించినది 32 సంవత్సరాలే. 8 సంవత్సరాల జీవిత కాలం 16 సంవత్సరాలయ్యాయి. తరువాత 16 సంవత్సరాలు వ్యాసుని చేత పొడిగింపబడ్డాయి. 32 సంవత్సరాలు జ్ఞానోపదేశానికి సరిపోతుందని భగవత్ సంకల్పం. శంకరులు జీవితాంతం, ఉపదేశంతో గడిపారు.
బ్రహ్మచర్యంలోనూ
వీరి జీవితంలో కొద్దికాలం బ్రహ్మచర్యం, గురుకులంలో సంపూర్ణ విద్యాభ్యాసం తరువాత సన్న్యాసం, ఆపైన ఉపదేశం, ఇట్లా సాగింది.
పిల్లవాడు, పుట్టీ పుట్టగానే ఉపదేశం మొదలు పెడితే అదేదో అద్భుత కృత్యమని జనులాశ్చర్యపోతారు. అవతారంలో మానవాంశ కూడా కనబడాలి. కదా! అట్టి అలౌకక వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారా? ఆశ్చర్య చకితులౌతారు గాని ఆదర్శంగా తీసుకోలేరు. అందువల్ల ఆదర్శ బ్రహ్మచారిగా కనబడ్డారు.
No comments:
Post a Comment