Tuesday 12 April 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 41 వ భాగం

 


ఇది లీలా సృష్టి కనుక శాశ్వతంగా ధర్మ సంస్థాపన చేయడు. అతడవతరించాలని అనుకోకపోయినా మన చేష్టలవల్ల అతడవతరించునట్లు చేస్తాం. అతడన్నిటినీ గమనిస్తాడు. అందువల్లనే సృష్టి, పోషణ, సంహారమూ కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా జీవుల కర్మలనుసరించే అతడవతరించడం ఎందుకని, అతణ్ణి బాధ పెట్టడమేమిటని మనం ఊరుకుంటామా? అతని సంకల్పానికి దూరంగా ఉండము. అట్టి సందర్భంలో కేవలం సంకల్పబలం వల్లనే సృష్టిని మూసివేయకుండా అవతరిస్తాడు. ధర్మ సంస్థాపన చేస్తాడు.


అంతా అతని సంకల్పము. అది మరొక దాని ద్వారా జరుగునట్లు చేస్తాడు. అధర్మం తల ఎత్తడమూ అతని సంకల్పమే. అసురుల వల్ల, క్రూరుల వల్ల అధర్మం తల ఎత్తుతుంది. కలిలో మానవులు చెడిపోయారంటే అది వారి మనస్సుల వల్లనే. మనస్సులో చెడ్డ ఆలోచన వచ్చినపుడు ఇంద్రియాలూ పనిచేస్తాయి అనగా సాధనలు, ఉపకరణాలు. కాని సంకల్పం బైటకు కనపబడదు. సంకల్పాల వల్లనే చెడ్డ పనులు. సంకల్పం వల్లనే వాటి నిర్మూలనం జరుగుతుంది. మంచి వాటికి చెందిన సాధనాలూ కావాలి. అందువల్లనే మహాత్ములనే సాధనాలను మాటిమాటికీ పంపుతాడు. పుట్టునట్లు చేస్తాడు. వారివల్ల సాధ్యం కాకపోతే తానే అవతరిస్తాడు.


మానవ స్వభావం - అవతారంలో దివ్యత్వం


ధర్మాన్ని స్థాపన చేయడంలో ఎన్నో దృష్టిలో పెట్టుకుంటాడు. ధర్మోపదేశం చేయడమే కాదు, దానిని ఆచరించి చూపిస్తాడు. వట్టి ఉపదేశం, తలకెక్కుతుందా? తాము ధర్మాచరణ చేస్తూ సుఖంగా ఉన్నవానిని చూసి ఇతరులకు వారిని అనుసరించాలనే బుద్ధి పుడుతుంది. తన జీవితాన్ని దృష్టాంతంగా చూపించడం అందుకోసమే.


అవతార పురుషులకు మానవులలో ఉన్న లోపాలుండవా? అందరికీ అందుబాటులో ఉండకుండా ఏ కొండ శిఖరాన్నో అధిరోహించి యుంటాడా? కోరికలు, ఎట్టి భావ సంఘర్షణలూ లేకుండా మనకందుబాటులో లేకుండా ఉంటాడా? అట్లా ఉండకుండా ఉంటే అతడు మనకాదర్శప్రాయుడెట్లా అవుతాడు? ఒక వస్తాదు, తన వక్ష స్థలంపై ఏనుగు నెక్కించుకొని యుండగా దానిని చూసి ఆశ్చర్యపోతాం. అయితే ఆ పనిని మనం చేయడానికి సిద్ధపడతామా? అవతార పురుషుడు అట్టివాడు కాడు. మనలో ఒకనిగా ఒకడై ఉంటాడు. మానవ స్వభావంతో ఉండి ధార్మికంగా మసలుతాడు. ధార్మిక కార్యాలలో ఎక్కడ మనం తప్పటడుగులు వేస్తామో అట్టి చోట్ల విజయాన్ని పొందుతూ ఆదర్శంగా ఉంటాడు.  


No comments:

Post a Comment