Monday, 9 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 65 వ భాగం



అది శూన్యము కాదు, సచ్చిదానందమే 


ఏదీ లేనపుడు శూన్యమని, అన్నీ శూన్యంలో అంతమౌతాయని భావించకండి. అది శూన్యమైనా దాని కాధారము ఆత్మయే. నీవాత్మ స్వరూపుడివి. శూన్యమెట్లా కుదురుతుంది? ఈ ఆత్మ అనే మాట పుస్తకాల వల్ల కొంతే తెలుస్తుంది. మనస్సు నిర్మూలింపబడిన స్థితి పట్టుబడడం కష్టం. అది అనుభవైకవేద్యం. పుస్తకాలేమంటాయి? నీకు మత్తు మందిచ్చినా, నిద్రబోతున్నా నీ సత్ స్వరూపం అవగతం కాదు. నీవు జ్ఞాన మార్గంలోకి వెళ్ళితే సమాధి స్థితిని చేరుకోగలిగితే నీవు సత్ అని తెలిసికోగలవు! అన్నీ అసత్యాలే. ఆత్మయే సత్యము. అది తాత్కాలిక సత్యానికి అనగా వ్యావహారిక సత్యానికి ఆధారం. నీవు సత్తే అని తెలిసికో. ఇట్లా అని చెప్పినపుడు చిత్ ప్రకాశిస్తూ ఉంటుంది. అనగా జ్ఞానంతో ఉంటావు. వట్టి జ్ఞానం వల్ల సత్ ని తెలిసికొంటే అది తప్పే. అపుడు ద్వైత భావన కల్గుతుంది. అంటే సత్ వేరని, తెలిసికొనేవాడికి చిత్ వేరనే భావన వస్తుందన్నమాట. సమాధి స్థితిలో సత్ ఒకటి, దీనిని తెలిసికొనుట మరొకటి ఉంటుందా? రెండూ ఒక్కటే. అపుడు చిత్ తో తెలిసికోవడం కాదు. నీవు చిత్ వి. అంతేకాక నీవు, ఆనంద స్వరూపుడవనే స్థితికల్గుతుంది. అప్పుడు ప్రపంచ బాధలు లేవు. అపుడు శూన్యం కాదు. బ్రహ్మానందం. ఇది లోనుండి వచ్చింది. బయటినుండి వచ్చింది కాదు. బాహ్యమైన వాటివల్ల కలిగే ఆనందం, ఈ అఖండానంద సాగరంలో ఒక్క బిందువే. కనుక సత్ - చిత్ ఆనందం ఒక్కటే. ఈ స్థితిలో బైటనుండి ఆనందం వస్తే అపుడది ద్వైతమే. కాబట్టి ఏ స్థితిలో సత్ చిత్ ఆనందంలో ఉన్నదో ఆ స్థితి బంధాలనుంచి విముక్తి చేసేదే మోక్షస్థితి. కాని శూన్యం కాదు.


జీవాత్మ పరమాత్మల భేదం లేదు


బంధాలనుండి జీవులను విముక్తులను చేసి ఈ ప్రపంచం కంటే పైనున్న వైకుంఠానికో లేదా కైలాసానికో పరమాత్మ తీసుకొని వెడతాడని, అక్కడే ఉంచుట మోక్షం అనే సిద్ధాంతాలవారంటారు. అంటే మోక్షంలో స్వామి యొకడు, ముక్తులు వేరనే భావన ఏర్పడుతుంది. మనకంటె భిన్నుడు స్వామియని భావిస్తారు. అనగా జీవుడు వేరు, పరమాత్మ వేరని. అతడు చరాచర వస్తు ప్రపంచ కర్తయని భావిస్తారు.


No comments:

Post a Comment