Thursday 12 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 68 వ భాగం



అతడు నిర్గుణుడైనా లోనున్నది సగుణ శక్తియే. అట్లా ఉండడం లేదా? అవతార లక్ష్యం ఏమిటి? కర్మ భక్తులద్వారా జ్ఞానాన్ని పొందడమే అయితే అందరూ క్రియారహిత స్థితిని పొందగలరా? ఏ పని లేకుండా కూర్చోగలమా?


కనీసం నిద్రలో అట్టి స్థితిని పొందడం లేదా? ఏ పని చేయకుండా మనస్సు ఊరుకోదు కదా! "నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠతి అకర్మకృత్" (భగవద్గీత 3.5) అంతేకాదు, మనస్సులో ఆలోచననే రాకూడదంటోంది అద్వైతం. ఈ మాటను ఎవరు వింటారు? విన్నా వినకపోయినా ఉపదేశించాలి. ఎవడో ఒకడైనా విని బాగుపడతాడు. ఒకనాటికైనా పరిపక్వస్థితి వస్తుందని ఆశ.


అందరూ కర్మ భక్తులను అనుసరించగలరు. భక్తిలో పండితే వైరాగ్యం వస్తుంది. అది పట్టుబడకపోయినా ఈశ్వరునిపట్ల అమిత ప్రేమను చూపించగలడు. కర్మకాండలు చేయలేకపోయినా పూజ, ఆలయదర్శనం, తీర్థయాత్రలైనా చాలు.


కనుక ప్రజలను దారి మళ్లించడం కోసం అవతరించాలి. వైదిక కర్మలను చేయుటకు ప్రోత్సహించాలి. తద్వారా చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పాలి. ఆలయాలలో యంత్ర ప్రతిష్టలు చేయాలి. ప్రజలను భక్తిమార్గంలో పెట్టాలని అవతారం ఏర్పడింది.


అంతేకాదు, క్రియారహిత స్థితియే పరమ లక్ష్యమని ప్రజలకు బోధించాలి. అపుడు జ్ఞాన మార్గానికి మళ్ళుతారు. దీనిని చాలామంది అనుసరించలేక పోవచ్చు. పరిపక్వత లేకపోతే అట్టి మార్గంలో అడుగు పెట్టవద్దని ఈశ్వర సంకల్పం కాబోలు. అందుకే ప్రవృత్తి మార్గాన్ని ముందు బోధించి, అందు వారు నిలద్రొక్కుకున్నతరువాత నివృత్తి మార్గాన్ని బోధించాలని అవతార సంకల్పం.


No comments:

Post a Comment