Tuesday 10 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 66 వ భాగం



కాని అద్వైతం ప్రకారం మాయవల్ల ఏర్పడిన మనస్సున్నంతవరకూ జీవుడు అనేక భావావేశాలకు లోనౌతాడని, జీవుడు, మాయను దాటగలిగితే శాశ్వత శాంతియని చెబుతుంది. సమస్త జగత్తు మాయవల్ల సంక్రమించింది. జీవునకు మనస్సెటువంటిదో బ్రహ్మమునకు మాయ అట్టిది. ఆత్మయొక్క నిజరూపం మనస్సు ఎట్లాకాదో, మాయ బ్రహ్మము యొక్క అసలు రూపం కాదు. బ్రహ్మము మాయతో కూడినపుడు ఈశ్వరుడు తన నిజరూపాన్ని చూపించడు. అట్లాగే మనస్సుతో కూడిన జీవుడు కూడా. మనస్సును దాటినపుడు, ఆత్మ తన సహజ రూపంలో ఉంటుంది. మాయను త్రోసి బ్రహ్మము తన నిజరూపంలో ఉంటుంది.


అట్లా అనినపుడు జీవాత్మ, పరమాత్మలు ఒకటి కావా? బ్రహ్మము మాయను గ్రహించి జగత్తును, మనస్సుతో కూడిన జీవుణ్ణి సృష్టిస్తున్నాడంటే బ్రహ్మము జగత్తుగా జీవునిగా కనిపిస్తున్నాడనే కదా! జీవుని నుండి మనస్సును తీసివేస్తే అతడు బ్రహ్మమే అవుతున్నాడు. రెండు ఆత్మలంటూ లేవు. ఉన్నది ఒక్కటే. అదే బ్రహ్మము.


స్వామి, మనల్ని వైకుంఠానికి తీసుకొని పోతున్నాడంటే, అది ఎంత గొప్ప స్థితియైనా మన నిజరూపమే మనకు తెలియడం లేదు. అతడు తన నిజరూపంలోనూ లేకుండా ఉంటాడు. అక్కడ జీవులు భక్తిని చూపిస్తూ ఉంటారు. అతడనుగ్రహిస్తూ ఉంటాడని అంటారు. మనస్సు లేకుండా భక్తినెట్లా చూపించగలం? ఎప్పుడైతే మనస్సుందో ఆత్మకు దూరంగా ఉండి మనస్సుతోనే అక్కడ జీవులుంటారు కదా! వారికి నిజరూపం ఎట్లా అవగతమౌతుంది? అందువల్ల పరమాత్మ ఎట్టి దివ్యానుగ్రహం చూపించాలి? అక్కడ జీవుడు  భక్తి చూపించనవసరం లేదని, భిన్నులనే భావన రానీయకూడదని వారిని తనకంటే భిన్నులుగా చూడవద్దని, భక్తుని మనస్సును పూర్తిగా పోగొట్టి తనలో భిన్న స్థితిని తీసుకొని రావడమే మోక్షమని అద్వైతం చెబుతుంది.


మోక్షముననుభవించుటయే గాని, మోక్షలోకం అంటూ ఏదీ లేదు. అక్కడ క్రియలేదు. పని ఉందంటే మనస్సున్నట్లే, మనస్సున్నంతవరకూ భేదభావం తప్పదు. కనుక దానినుండి విడుదల చేస్తాడు.


No comments:

Post a Comment