Sunday 8 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 64 వ భాగం



మన కంటే మరొకడు లేనప్పుడు, మనకన్నా మరొకటి విడిగా లేనపుడు ప్రేమగానీ, ద్వేషం గాని కల్గుతోందా?


అంటే మిగిలినవారు లేకుండా నాశం చేయాలని కాదు. అట్లా ఎవ్వరూ చేయలేరు. అట్టి శక్తియున్న ప్రాణులను సంహరించవచ్చు గాని జడరూపాన్ని రూపుమాపగలమా? దానిని నిర్మూలిస్తే మనం ఎక్కడ ఉంటాం?


విడిగా నున్న వ్యక్తుల వల్లనే కాదు, జడ ప్రకృతి వల్ల, శాంతికి భంగం కల్గుతోంది. మామిడిపండు కనబడితే తినాలనే ఉబలాటం ముళ్ళ చెట్టును చూస్తే ముళ్ళు గ్రుచ్చుకుంటాయేమోనని బాధ, ఇక ఉరుములు, మెరుపులు, భూకంపాల వల్ల భయం మొదలైనవి ఎన్నో కల్గుతున్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఎలా?

అన్నిటినీ వదిలించుకున్నా ఆకలి దప్పులు మనల్ని బాధిస్తాయి. ఇక కోరిక, దుఃఖం సరేసరి. కోరికల పరంపరకు అంతులేదు. ఎవ్వరూ కనబడకపోయినా ఒంటరిగా ఉన్నా అట్టి భావాలు వెంట తరుముతూ ఉంటే శాంతి ఎక్కడ? ఏమిటి? మూర్ఖునిగా ఆలోచించానేమిటియని తనను తానే నిందించుకుంటాడు. 


తనకంటే భిన్నమైనది లేదనే భావనను అద్వైతము అందిస్తున్నదంటే దానికి అర్ధం తనకంటే భిన్నమైన వ్యక్తి ఉండకూడదని కాదు. అయితే ఉండకూడనిది ఏమిటిది? మనస్సే. ఇది ఎంతవరకూ మన దగ్గర ఉంటుందో అనేక దుఃఖ పరంపరలు సిద్ధం. మత్తుమందిచ్చి శస్త్ర చికిత్స చేసినపుడు బాధ పడుతున్నామా? రోజూ నిద్ర బోతున్నారు. అపుడు చరాచర వస్తు ప్రపంచం లేకుండా ఉందా? అయితే ఎప్పుడు బాధ కల్గుతోంది? మనస్సు పనిచేసినపుడే. మనస్సుంటేనే కదా సుఖ దుఃఖాలనుభవించేది?


కనుక రెండవ వ్యక్తి ఎవరు? నీ మనస్సే. నిద్ర బోతున్నపుడు గాని, మత్తు మందిచ్చినపుడు గాని నీ మనస్సు లేదు. కాని నీవు బ్రతికే యున్నావు. అట్టి ప్రాణశక్తియే ఆత్మ. అదే నీ నిజరూపము. మాయ, మనస్సును రెండవదానిగా తీసుకొని వచ్చింది. జ్ఞానం వల్ల దీనిని నిర్మూలించు, అపుడు నీకంటె మరొకటి కనబడదు. అపుడు అద్వైతం పట్టుబడుతుంది. నీకంటే మరొకటి లేదనినపుడు క్రియలేదు, మాట లేదు, దానికై వెంపర్లాడడం లేదు. నిన్ను అటూ ఇటూ లాగే ప్రపంచమూ నిన్నేమీ చేయలేదు. అపుడు నీ దృష్టిలో ప్రపంచము లేదు. నీవు ఒంటరిగా ఉన్నా కోపతాపాలు నీ దరిచేరవు. శాశ్వత కాంతితో ఉండిపోతావు. నిన్ను మంచి చెడులు రెండూ బాధించవు.


No comments:

Post a Comment