Sunday, 22 May 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 78 వ భాగం



స్వార్థంతో ఉండడం కాదు


నీవొక జీవుడవనుకొని, డబ్బు, అధికారం, మొదలైనవి సంపాదించడం స్వార్ధ పరత్వం. వీటిని ఇతరులకు త్యాగం చేయవలసి వస్తుంది. ఇక కేవలం ఆత్మగా భావిస్తే, క్రియారహితుడవైతే స్వార్ధమూ లేదు, ఇతరులకు సాయం చేయడం అంటూ ఉండదు. కేవలం నేను అనేది పోతే ఇక స్వార్ధం ఎక్కడ? శాశ్వత సత్య స్థితిలో ఈ నేను పోయినపుడు ఇతరులకొరకై చేస్తున్నాననడం అసందర్భం. 


అట్టి క్రియారహిత స్థితి చేరుకోనంత వరకూ కార్యక్రమాలు చేయవలసిందే. ఆ పై స్థితి, ఎందుకు పట్టుబడడం లేదు? ఎన్నో కర్మఫలాలు వెంటబడుతూ ఉండడంవల్ల దీనిని తెలిసికోలేకపోతున్నాం. దుష్టకర్మ ఫలాలనుండి తప్పించుకోవడం కోసం శాస్త్ర కర్మలు చేయాలి. ఇతరులకు సాయమూ చేయాలి. ఆ అడ్డు వచ్చే తెర, అట్లాగే ఉండుగాక, నేను చీకట్లో ఉంటానంటే అది తెలివైన పనికాదు. ఈశ్వరుని సంతోషపెట్టడమూ కాదు. "ఉద్ధరేత్ ఆత్మనాత్మానం" = నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవు విడుదల చేసుకోవాలి. "న ఆత్మానం అవసాదయేత్" = నిన్ను నీవు తగ్గించుకోవద్దు. జ్ఞానమార్గంలో అడుగు బెట్టనని కర్మలోనే మునిగిపోతానని పట్టుబట్టకు, "ఆత్మా ఏవహి ఆత్మని బంధుః" = నిన్ను నేను విడిపించుకోగలిగితే ఆత్మయే నీ దగ్గర బంధువు "ఆత్మా ఏవరపు రాత్మనః" = నేను ప్రయత్నం చేయనని బిగుసుకునిపోతే నీవే నీకు శత్రువౌతావు, అని భగవానుని మాటలు నా ఆత్మకు ఏదైనా కానీ, నేను ప్రపంచానికి మంచి చేస్తానని భీష్మించుకొంటున్నావు. ఆ మంచి ఫలాలు నీ చేతిలో లేవు, పైవాడి చేతిలో ఉన్నాయని మరిచిపోతున్నావు. నీవనుకున్నవి జరగకపోవచ్చు కూడా.


మోక్షసుఖం కూడా అక్కర్లేదు. ప్రాణులకు సాయం చేస్తామనేవారి మాటలు, మనం ప్రాథమిక దశలో ఇతరులకు సాయం చేయాలని బోధించడానికే, కేవలం స్వార్ధంతో ఉండకూడదని హెచ్చరించడానికే. పైవారు మోక్ష సుఖాన్ని కూడా త్యజిస్తున్నారంటే మనము కేవల స్వార్ధపూరితమైన పనులను విడిచిపెట్టాలని బోధించడానికే.


No comments:

Post a Comment